హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అక్కడ మేకపాటికి తిరుగులేదా?

నెల్లూరు జిల్లా అధికార వైఎస్సార్ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న విషయం తెలిసిందే. ఆ పార్టీ వచ్చిన దగ్గర నుంచి జిల్లాలో టీడీపీకి పరిస్తితి దారుణంగా తయారైంది. ఇక్కడ వైసీపీ తిరుగులేని విజయాలు సాధిస్తుంది. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ వైసీపేదే హవా. ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీ ఆధిక్యం కొనసాగుతుంది.
ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి దూసుకెళుతున్నారు. మొదట నుంచి ఈ నియోజకవర్గంలో మేకపాటి ఫ్యామిలీకు ఎదురులేదు. 1985లో ఇక్కడ నుంచి మేకపాటి రాజమోహన్ రెడ్డి కాంగ్రెస్ తరుపున గెలిచారు. ఇక 2004, 2009 ఎన్నికలో చంద్రశేఖర్ కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు. జగన్ కోసం ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలోకి వచ్చి, 2012లో ఉదయగిరికి జరిగిన ఉపఎన్నికలో వైసీపీ తరుపున నిలబడి భారీ మెజారిటీతో గెలిచారు.
ఇక 2014 ఎన్నికల్లో మేకపాటి స్వల్ప మెజారిటీ తేడాతో ఓడిపోయారు. మళ్ళీ 2019 ఎన్నికల్లో 36 వేల ఓట్లపైనే భారీ మెజారిటీతో గెలిచారు. ఇలా భారీ మెజారిటీతో గెలిచిన మేకపాటి, నియోజకవర్గంలో దూసుకెళుతున్నారు. ప్రభుత్వ పథకాలు మేకపాటికి ప్లస్ అవుతున్నాయి. ఉదయగిరిలో జగనన్న కాలనీలు పేరిట ఇళ్ళు కట్టించే కార్యక్రమం జరుగుతుంది. అయితే ఇక్కడ పలు సమస్యలు కూడా ఉన్నాయి.

 
తాగునీరు, సాగునీరు సమస్యలు ఎక్కువగానే ఉన్నాయి. రైతులకు సరైన గిట్టుబాటు ధర అందడం లేదు. అలాగే ధాన్యం అమ్మిన డబ్బులు ఇంతవరకు రైతుల ఖాతాల్లో పడలేదు. ఇక వర్షాలకు నియోజకవర్గంలో రోడ్లు దెబ్బతిన్నాయి. అయితే ఇక్కడ ప్రభుత్వ పథకాలు మినహా, పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదు.

 
ఇక ఇక్కడ టీడీపీ పెద్దగా పుంజుకోలేదు. మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు యాక్టివ్‌గా లేరు. దీంతో టీడీపీ క్యాడర్ కూడా సైలెంట్‌గా ఉండిపోయింది. ఇప్పుడు ఇదే ఎమ్మెల్యే మేకపాటికి ప్లస్ అవుతుంది. ఏదేమైనా ఉదయగిరిలో మేకపాటికి తిరుగులేనట్లే కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: