హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అక్కడ రామ్మోహన్ బావదే డామినేషన్...

2019 ఎన్నికల్లో చంద్రబాబు ఒక కుటుంబానికి ఒకటే టిక్కెట్ అని చెప్పి, ఎన్నికలకు వెళ్ళిన విషయం తెలిసిందే. ఈ రూల్‌తో కొందరు సీనియర్లు పోటీ నుంచి తప్పుకుని తమ వారసులని ఎన్నికల బరిలో దింపగా, మరికొందరు ఈసారికి వారసులని ఆపి వారే పోటీ చేశారు. అయితే దివంగత ఎర్రన్నాయుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు కుటుంబాల విషయంలో బాబు ఈ రూల్ పెట్టలేదు.
దీంతో ఎన్నికల్లో అశోక్, ఆయన కుమార్తె అతిథిలో పోటీ చేయగా, ఎర్రన్నాయుడు కుటుంబం నుంచి ఆయన సోదరుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, కుమారుడు రామ్మోహన్ నాయుడు, కుమార్తె ఆదిరెడ్డి భవానిలు పోటీ చేశారు. ఇక జగన్ గాలిలో టీడీపీ నేతలు చిత్తు చిత్తుగా ఓడిపోయారు. అశోక్ గజపతి, ఆయన తనయురాలు అతిథిలు కూడా ఓటమి పాలయ్యారు. కానీ టెక్కలి నుంచి అచ్చెన్న మరోసారి గెలవగా, రామ్మోహన్ శ్రీకాకుళం ఎంపీగా రెండోసారి గెలిచారు. అటు రాజమండ్రి సిటీ నుంచి భవాని భారీ మెజారిటీతో గెలిచారు.
దాదాపు 30 వేల ఓట్లపైనే మెజారిటీతో రామ్మోహన్ సోదరి విజయం సాధించారు. అయితే తొలిసారి ఎమ్మెల్యే అయిన భవానికి పెద్దగా రాజకీయాలు తెలియకపోవడంతో, ఆమె భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ నియోజకవర్గ బాధ్యతలనీ చూసుకుంటున్నారు. నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్న శ్రీనివాస్ పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు. ప్రతిపక్ష స్థానంలో ఉన్నా సరే శ్రీనివాస్ ప్రజల కష్టాలు తీర్చడంలో ముందున్నారు.
ప్రతిరోజూ ఫీల్డ్‌లో ఉంటూ ప్రజలని కలుస్తున్నారు. ఈ కరోనా సమయంలో ప్రజలకు మరింత అండగా నిలిచారు. అలాగే నియోజకవర్గంలో సమస్యలపై బాగానే పోరాటం చేస్తున్నారు. అటు ప్రభుత్వంపై కూడా దూకుడుగానే విమర్శలు చేస్తున్నారు. కాకపోతే ఎమ్మెల్యేగా ఉన్న భవాని ఏమో సైలెంట్‌గా ఉండటం, శ్రీనివాస్ నియోజకవర్గంలో తిరుగుతుండటంతో, రాజమండ్రి నగరంలో భవాని భర్త పెత్తనం ఎక్కువైందనే టాక్ వస్తోంది.
అటు మొన్న ఎన్నికల్లో భవాని మీద పోటీ చేసి ఓడిపోయిన రౌతు సూర్యప్రకాశ్ రావు సైలెంట్ కావడంతో వైసీపీ అధిష్టానం శిఖాకొల్లు శివ రామ సుబ్రహ్మణ్యంకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. అధికార పార్టీ నేతగా శిఖాకొల్లు కూడా దూకుడుగానే పనిచేస్తున్నారు. ప్రజలకు పథకాలు అందించే విషయంలో ముందున్నారు. కానీ ఎంత అధికారంలో ఉన్నా సరే సిటీలో వైసీపీ కంటే టీడీపీనే కాస్త బలంగా కనిపిస్తోంది. ఆదిరెడ్డి ఫ్యామిలీ స్ట్రాంగ్ ఉండటంతో ఇక్కడ వైసీపీకి కాస్త ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: