FB ప్రొఫైల్ పిక్‌గా జాతీయపతాకాన్ని వాడితే చట్టవ్యతిరేకమేనా..?!

‘‘మీరు మీ ఫేస్‌బుక్ ప్రొఫైల్ పిక్‌గా గానీ, డీపీగా గానీ జాతీయ పతాకాన్ని పెట్టుకుంటున్నారా..? జాగ్రత్త… 1971 నాటి Prevention of Insults to National Honor Act ప్రకారం, 2002 నాటి Flag code of India ప్రకారం గానీ శిక్షార్హం… బహుపరాక్…’’ అని రెండు రోజుల నుంచి ఫేస్‌బుక్ పోస్టులు, వాట్సప్ షేరింగులు విరివిగా కనిపిస్తున్నాయి… ఇది నిజమేనా..? లేక వచ్చే ఆగస్టు 15నాడు చాలామంది ఇలా జాతీయపతాకాన్ని ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకోబోతున్నారు.

కాబట్టి దాన్ని నిరుత్సాహపరిచేందుకు ఎవరైనా కావాలని ఈ సందేశాన్ని వ్యాప్తి చేస్తున్నారా..? ఇదీ చాలా మందికి వస్తున్న సందేహం… అని అడుగుతున్నారు చాలామంది… అదేసమయంలో అసలు మనం పదే పదే చెప్పుకుంటున్నట్టు జాతీయ పతాకం రూపొందించింది నిజంగానే మన పింగళి వెంకయ్యేనా అని కూడా ప్రశ్నిస్తున్నారు… అది మరో పోస్టులో చెప్పుకుందాం గానీ, ముందయితే ఈ ప్రొఫైల్ పిక్స్ సంగతి చూద్దాం.
 
అసలు 1971 నాటికి ఈ ఫేస్‌బుక్ గొడవంటూ ఏమీ లేదు కదా, మరి ఈ నిబంధన ఎక్కడిది అనే ప్రశ్న సబబే… కానీ ఆ చట్టం జాతీయ పతాకం పట్ల చేయదగినవి, చేయకూడనివి ఏమిటో స్పష్టంగా వివరిస్తుంది… జాతీయ పతాకాన్ని అగౌరవపరిస్తే శిక్షలు ఏమిటో కూడా చెబుతుంది. ప్రైవేటు సంస్థలు గానీ, ప్రైవేటు వ్యక్తులు గానీ ఎప్పుడుపడితే అప్పుడు, ఎక్కడపడితే ఎక్కడ జాతీయ పతాకాన్ని ఎగరవేయడం గానీ, ప్రదర్శించడం గానీ సరికాదని అప్పటి చట్టం చెబుతుంది.

నిర్ణీత తేదీల్లో, నిర్దేశిత పద్ధతుల్లో మాత్రమే జాతీయ పతాకాన్ని ఎగురవేయాలి. అయితే ఇక్కడో విషయం చెప్పుకోవాలి…  2001లో నవీన్ జిందాల్ అనే ఇండస్ట్రియలిస్టు తన ఆఫీసు బిల్డింగుపై ఎగరేశాడు… దాన్ని తప్పుగా భావించిన అధికారులు జెండాను స్వాధీనం చేసుకుని, ప్రాసిక్యూట్ చేస్తామని హెచ్చరించారు.  తను ఢిల్లీ హైకోర్టులో ఓ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ పిటిషన్ వేశాడు… ఒక భారతీయ పౌరుడు తన జాతీయ పతాకం పట్ల అమిత గౌరవం ప్రదర్శిస్తూ, భక్తిని వ్యక్తీకరిస్తూ ఎగురవేస్తే తప్పేముందని తన వాదన… రకరకాల అప్పీళ్ల తరువాత సుప్రీంకోర్టు దీన్ని విచారించింది… జిందాల్ వాదనను సమర్థించి కేంద్రప్రభుత్వానికి ఫ్లాగ్  కోడ్ సవరించాలని సూచించింది.


దీంతో కేంద్రప్రభుత్వం 2001 జనవరి 26న ఫ్లాగ్ కోడ్‌కు సవరణలు చేసింది… జాతీయ పతాకం డిగ్నిటీ, గౌరవం, మర్యాద దెబ్బతినకుండా ప్రైవేటు వ్యక్తులు ఎగరేసుకోవచ్చునని సవరించింది.  జూలై 2005లో యూనిఫారాలు, దుస్తులపై జాతీయ పతాక ప్రదర్శన విషయంలోనూ కొన్ని సవరణలు చేసింది… లోదుస్తులు, పిల్లోకవర్లు, జేబురుమాళ్లు, నడుం కింద భాగాల దుస్తులపై మాత్రం నిషేధించింది.

సో, ప్రత్యేకించి ఫేస్‌బుక్‌లో ఇలా వాడాలి, వాడకూడదు వంటివేమీ ఉండవు చట్టాల్లో, నియమావళిలో…! అయితే ఒక ఫేస్‌బుక్ యూజర్ జాతీయ పతాకం పట్ల తన గౌరవప్రపత్తులను ప్రదర్శించుకోవడం కోసం ప్రొఫైల్ పిక్‌గా గానీ, డీపీ (Display Picture) గా గానీ వాడితే అందులో తప్పేమీ లేదు.  అయితే తల్లకిందులుగా, వంకరగా, తప్పులతో ప్రదర్శిస్తే మాత్రం తప్పే… (Subject to Corrections Please… ) ఇదొక్కటే కాదు, ఏ విషయంలోనైనా అగౌరవపరిస్తే తప్పు అవుతుంది గానీ, మరింత గౌరవాన్ని చూపిస్తే తప్పెలా అవుతుంది..!?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: