ఏపీ: అక్కడ జనసేనకి తిరుగులేదు... వైసీపీ గ్రాఫ్ పాతాళానికి?

Suma Kallamadi
ఏపీలో ఎన్నికలకు సరిగ్గా 2 వారాలు మాత్రమే మిగిలి వుంది. దాంతో విపక్షాల ప్రచారాలు ఊపందుకున్నాయి. ఇక పెందుర్తి నియోజకవర్గం రోజురోజుకూ జనసేనకు అనుకూలంగా మారుతుండడం చాలా ఆసక్తికరంగా మారింది. ఇక్కడ స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అరాచకాలు, అక్రమాలు, అవినీతి జనసేనకు సానుకూలంగా మారాయని చెప్పుకోవచ్చు . వాటికి తోడుగా ఇక్కడ కూటమి పక్షాల ప్రధాన నేతలకు టికెట్లు, పదవులు రావడంతో వారి అనుచరులు కూడా కలసికట్టుగా పని చేస్తుండడం జనసేనకు అనుకూలంగా మారింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇంకో విషయం ఏమిటంటే, విశాఖ నగర శివారులోని అతి పెద్ద నియోజకవర్గమైన అనకాపల్లి జిల్లా పెందుర్తి ఇప్పటి వరకు రెండో పర్యాయం ఎవ్వరికీ అవకాశం ఇవ్వకపోవడం కొసమెరుపు.
అయితే, ఈ ఎన్నికలలో అనూహ్యంగా గతంలో ఇక్కడి నుంచి గెలిచిన అభ్యర్థులిద్దరూ పోటీ పడడం ఇపుడు ప్రత్యేకతని సంతరించుకుంది అని చెప్పుకోవచ్చు. వైపీపీ నుంచి అన్నంరెడ్డి అదీప్ రాజ్ పోటీ చేస్తుండగా, పొత్తులో భాగంగా జనసేన నుంచి మాజీ శాసన సభ్యుడు పంచకర్ల రమేష్ బాబు బరిలో ఉన్నారనే సంగతి అందరికీ తెలిసినదే. తెలుగుదేశం పార్టీ నుంచి పెందుర్తి టికెట్ ఆశించిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి ఆఖరి నిమిషంలో పక్కనే ఉన్న మాడుగుల టికెట్ కేటాయించడం పంచకర్లకు పెద్ద రిలీఫ్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. టికెట్ ఖరారయ్యేంత వరకూ బండారు అలకలో ఉన్నారు. దాంతోనే పంచకర్లకు సహకరించ లేదు. ఇక టికెట్ ఖరరయ్యాక ఏర్పాటు చేసిన సమావేశంలో పంచకర్లను గెలిపించాల్సిందిగా బండారు గట్టిగా పిలుపునివ్వడం జరిగింది.
కాపులు, కొప్పుల వెలమలు మెజారిటీలుగా వున్న ఈ నియోజక వర్గంలో పంచకర్ల కాపు కాగా, బండారు కొప్పుల వెలమ. అందువలన వీరిద్దరి కలయికతో కూటమి ఇక్కడ క్లీన్ స్వీప్ చేయబోతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. పెందుర్తి నియోజక వర్గానికే చెందిన మాజీ శాసనసభ్యుడు గండి బాబ్జీ నాలుగు రోజుల క్రితం వరకూ విశాఖ దక్షిణనియోజక వర్గ తెలుగుదేశం ఇన్చార్జిగా ఉన్నారనే సంగతి విదితమే. ఆ సీటు కూడా జనసేనకు వెళ్లడంతో పార్టీ అధిష్టానం ఆయనను విశాఖ అధ్యక్షుడిగా నియమించి కూల్ చేసింది. అయితే, భవిష్యత్ రాజకీయ అవసరాల దృష్ట్యా తనను పెందుర్తి ఇన్చార్జిగా నియమించాల్సిందిగా కోరారు. అందుకు అధిష్టానం అంగీకరించి నియమించడం ఇప్పడు పంచకర్లకు అనుకూలంగా మారింది. అటు బండారు, ఇటు బాబ్జీ చెరోవైపు పంచకర్ల కోసం పని చేస్తే, వారి మద్దతు దారులు కలసి వస్తే ఇక తిరుగే ఉండదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp

సంబంధిత వార్తలు: