ఏపీ నుంచి 5 గురు రెడ్డి ఎంపీలు ప‌క్కా... అక్క‌డే ఉంది అస‌లు లెక్క‌...?

RAMAKRISHNA S.S.
- 5 పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల్లో రెండు వైపులా రెడ్లే పోటీ ?
- క‌డ‌ప‌లో ష‌ర్మిల రెడ్డి పోటీతో రెడ్ల మ‌ధ్య ముక్కోణం
- సైకిలెక్కి ఎంపీ టిక్కెట్ ప‌ట్టేసిన వేమిరెడ్డి, మాగుంట‌
( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )
ఆంధ్రప్రదేశ్ నుంచి ఈసారి లోక్‌స‌భలో ఐదు గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎంపీలు అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విషయంలో ఎవరికి ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ఇటు కూటమి నుంచి.. అటు వైసీపీ నుంచి 5 పార్లమెంటు స్థానాలలో రెండు వైపులా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు పోటీ పడుతుండడంతో.. ఏ పార్టీ గెలిచిన ఖచ్చితంగా రెడ్డి ఎంపీ పార్లమెంటులో అడుగుపెట్టడం ఖాయం అయింది. రెండు వైపులా రెడ్డి సామాజిక‌ వర్గానికి చెందిన నేతలు పోటీ చేస్తున్న పార్లమెంటు స్థానాలు.. అక్కడ పోటీ చేసే అభ్యర్థులు వివరాలపై ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ప్రత్యేక కథనం.

నంద్యాలలో నిన్నటి వరకు బీజేపీలో ఉన్న బైరెడ్డి శబరి టీడీపీ నుంచి పోటీలో ఉంటే ప్రస్తుత వైసీపీ సిట్టింగ్ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి మరోసారి అదే పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే రాజంపేటలో ఇప్పటికే వరుసగా రెండుసార్లు వైసీపీ నుంచి గెలిచిన పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. ఇక్కడ కూటమిలో భాగంగా బిజేపీ నుంచి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చివరి ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి తొలిసారి పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. వైసీపీకి పట్టున్న‌ రాజంపేటలో ఆయన మిథున్ రెడ్డికి ఎంతవరకు గట్టి పోటీ ఇస్తారు అన్నది చూడాలి.

ఇక వైఎస్ జగన్ కంచుకోట కడప పార్లమెంటులో ఈసారి ముక్కోణ‌పు పోటీ ఏర్పడింది. టీడీపీ నుంచి భూపేష్ రెడ్డి.. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తో పాటు.. వైయస్ జగన్ సోదరి వైయస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ముక్కోణ‌పు పోటీలో ప్రస్తుతానికి వైసీపీకి పై చేయి కనిపిస్తున్నా.. షర్మిల భారీగా ఓట్లు చీల్చితే ఏం జరుగుతుంది ? అన్నది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. ఇక ఒంగోలు, నెల్లూరు పార్లమెంటు స్థానాలలో విచిత్రం నెలకొంది. నిన్నటి వరకు వైసీపీ ఎంపీలుగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇద్దరు తెలుగుదేశంలో చేరి ఒంగోలు, నెల్లూరు పార్లమెంటు స్థానాలకు పోటీపడుతున్నారు.

ఇక జగన్ ఒంగోలు నుంచి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని.. నెల్లూరు నుంచి రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డిని పోటీకి దించారు. మామూలుగా అయితే వైసీపీకి ఆధిక్యం ఉండే ఈ రెండు పార్లమెంట్ స్థానాలలో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన బల‌మైన అభ్యర్థులు పోటీలో ఉండడంతో పోరు రంజుగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: