మార్నింగ్ రాగా : తిరువీధి చెంత శ్రీనివాసుడు
ఫస్ట్ కాజ్ : బ్రహ్మోత్సవాల వేళ ఆత్మ సిద్ధి
రాళ్లను పూజించిన దేశంలో అంటూ వస్తొందొక పాట
వింటున్నాను ఓ చోట.. రాళ్లను రాళ్లలో దాగిన జీవ నాదాన్నీ
పూజించిన చోట నేనున్నాను..ఈ రాళ్లే సుప్త చైతన్య వీచికలు
ఇవి ప్రబంధ సంబంధాలు అని నిర్ణయించి ఏక శిలా మూర్తికి
వందనాలు చెల్లించి బ్రహ్మోత్సవ వైభవాన నేను
ఆ కాంతి నాది ఆ చీకటి తనది.. వెలుగుకే కాదు చీకటికి కూడా
వాంగ్మయ హోదా ఇస్తున్నానీ వేళ
అంతయు నీవని చెప్పేందుకు సంబంధించిన అంగీకారం ఈ మనుషులకు లేదు. ప్రేమ తత్వం నిండిన వీధులలో నడయాడిన చోట నేను శ్రమ వేదాలను విన్నాను. నీ ఇంటి అరుగును శుభ్రపరిచిన కార్మికుడికి దగ్గర ఏ సంపన్నుడూ సాటి రాడు. కాళ్ల చెంత భూమిని మనం కొలవడంలో తప్పు చేస్తున్నాం. నేల చెంత ఒక ఆశ్చర్యం ప్రకటించి, ఏవేవో పట్టుకుని ఊహలకు విస్తృత రూపం ఇస్తున్నాం. కొన్నిసార్లు వికృత రూపం కూడా ఇస్తున్నాం. మనుషుల భయాలూ, కోపాలూ చదివి చూసి విని నవ్వుకున్నాను. చదవడం క్రియా రూపం..భయం ధాతువు అయితే ఆ చదువు ఇంకొంత భయపెడుతోంది. కోపం కూడా క్రియా రూపమే.. నిత్యం వెన్నాడే ఆందోళనలను వదిలి పోని రోజు ప్రేమ కూడా శత్రువు అయి తీరుతుంది. ఆ ప్రేమకు ఈ కోపం జత. బ్రహ్మాండ నాయకుడు అని నీ గురించి రాస్తారు, ఆ వెలుగులో కోపం ఉంటుందా ఏమౌతుంది. మనుషుల కోపాలన్నీ నీ దగ్గర ఎందుకని కరిగిపోవు అనే సందేహాస్పద స్థితి నుంచి వస్తాను. ప్రాణ స్వరాలకు కొనసాగింపు లిపి రాస్తాను. ఇప్పుడు ప్రాణం ఎవ్వరిది. నీ చెంత ఉన్న భక్తులతో మాట్లాడుతూ ఉంటాను. కొలిచే రూపానికీ, అస్సలు కొలవని భావానికీ మధ్య జరిగే అంతః సంఘర్షణ ఎప్పటికీ నిలిచే ఉంటుందని..
బ్రహ్మోత్సవాల వేళ వీధులు అన్నీ కళ కళలాడుతాయి. ప్రేమ నిండిన రూపాలలో వీధులు నన్ను ఆకర్షించడం లేదు. కొన్ని ప్రాభావిత స్వరాలలో వీధులు లేవు. శుభ్రమయిన గాలి శుభ్రమయిన నీరు శుభ్ర పరిచిన నేల.. ఆత్మను ఆకర్షిస్తాయి. గాలిని సంస్కరించే శక్తిని ప్రసాదించే వేళ నీవున్న చోటు ఇంకొంత ప్రశాంతత. నీళ్లను సంస్కరించే చోట రాళ్ల నుంచి వచ్చే పుట్టుక ఇంకొంత స్వచ్ఛత. నేలను సంస్కరించే వేళ నీ చెంత ఒక భాగ్యము. ఈ భాగ్యమే విష్ణు కథ.. వినరో భాగ్యము విష్ణు కథ. కైవల్య సిద్ధి అని రాయాలి. నేలను నమ్ముకుని నింగికిపోయిన దారి కైవల్యం.. ముక్తి అన్నది పెద్ద పదం. నమ్మకూడదు కూడా.. స్వామి బ్రహ్మోత్సవాన్ని ముక్తి ప్రసాదిత మార్గం అని నేను భావింపను. ఆ మార్గాన్ని శుభ్రపరిచేందుకు మనుషులకు కొన్ని అవకాశాలు మాత్రమే భగవంతుడు ఇస్తున్నాడు. నీవు నవ్వుతూ పోతున్నావు.. నేను విసుగు చెందాను.
కన్నీళ్లను నింపుకుని అమ్మానాన్నలకు వందనాలు ఇచ్చే వేళ మళ్లీ నీ నవ్వులు చూశాను. ఆత్మ నివేదిత స్వరాలకు ఆది నువ్వు అని రాసుకోవడంలోనే అర్థం ఉంది అని అనుకుని తప్పుకున్నాను. కన్నీటి రాతలను భగవంతుడు రద్దు చేస్తాడు. రూపాన్ని రద్దు చేసి గుణాన్ని ఇస్తాడు. గుణాన్ని ఇచ్చాక సద్గతి ప్రాప్తి అన్నది వెతుక్కోవాలి. అన్నీ వాడివేనా కాదు కొన్ని నావి.. నా లోపలి శక్తులు చేసే యుద్ధం నుంచి నేను పొందిన కారుణ్యాన్నీ ప్రేమనూ వాడికి ఇచ్చాక ప్రతి పొందిన వరం రాయడం అనే సుకృతం.. బాగా రాయడంలో చైతన్యం ఉంది అంటారు కాదు స్వానుభవ సిద్ధిని మించిన చైతన్యం ఎక్కడా లేదు. నేను నా నేల నుంచి ఆ సిద్ధిని అందుకుంటాను.. అదే అద్వైత సిద్ధి అని భావించి నడయాడుతాను. కనుల్లో కొలువుండిన రూపంలో నేనున్నాను. కన్నీటి రాతల దిద్దుబాటుల్లో వాడున్నాడు.. దిద్దడం బాధ్యత.. రాయడం కర్తవ్యం.. ప్రేమ కూడా!
ప్రేమే లేకపోతే ఇన్ని ఎలా సాధ్యం.. బ్రహ్మోత్సవం ఏకాంతాలను ప్రసాదించింది ఈ సారి కూడా! అందుకే ఇది ఏకాంత బ్రహ్మోత్సవం. నేను నీ దగ్గర నడయాడి వచ్చిన ప్రతి సారీ ఎన్నో నేర్చుకున్నాను. నీ దగ్గర ఉన్న పాలకులపై కోపం పడ్డాను. ఈర్ష్య, అసూయ ఉన్న మనుషులనూ చూశాను..నన్ను ప్రేమించే మనుషులు నీ ఆలయం లో ఉన్నారని వారంతా నాకు దగ్గర అని తెలుసుకున్నాక పొంగిపోయాను.కిశోర్ గారూ! మీరు రావాలి ఈ నేల గురించి మీరు రాయాలి అన్న బాధ్యతను నేర్పిన నా స్నేహితులకు వందనాలు చెల్లిస్తూ..స్వామి స్మరణ కన్నా బాధ్యతనే ప్రేమిస్తాను.. స్మరణ ఉపశమనం.. బాధ్యత ఉపయుక్తం. ఉపయోగం..ఏదో ఒకటి రాసుకోండి.. నిర్ణయాత్మక నీడల్లో నేను..వైభవం భక్తి.. కీర్తన భక్తి..బాధ్యత కూడా భక్తి స్థాయిని సమాజ రీతిని నిర్దేశించే భక్తి.. బ్రహ్మోత్సవాల వేళ దొరికే సిద్ధి దొరికే ముక్తి ఏదో ఒకటి మీదే కావాలి...శుభాకాంక్షలిక.
- రత్నకిశోర్ శంభుమహంతి