మహాభారతం: కురుక్షేత్రంలోనే ఎందుకు యుద్ధం జరిగింది? దీని ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు అక్కడికి ఎలా వెళ్లొచ్చు?

Purushottham Vinay
మహాభారతంలో పాండవులకు, కౌరవులకు మధ్య జరిగిన కురుక్షేత్రం యుద్ధం చరిత్రలో గొప్ప యుద్ధంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే కురుక్షేత్రంలోనే యుద్ధం ఎందుకు జరిగింది? అసలు ఈ ప్రదేశం ప్రత్యేకత ఏంటి? ఇక్కడికి ఇప్పుడు ఎలా వెళ్ళవచ్చో తెలుసుకుందాం. మాయాజూదంలో ఓడిన పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తిచేసుకున్నాక ఈ మహాభారతయద్ధం జరిగింది. అయితే ఈ మహా సంగ్రామాన్ని ఎక్కడ నిర్వహించాలి అనే చర్చ జరిగినప్పుడు అప్పుడు కురుక్షేత్రం ప్రదేశాన్ని ఎంపిక చేశాడు ధృతరాష్ట్రుడు. అయితే దీని వెనుకున్న ఉద్దేశం ఏంటంటే.. పరాక్రమవంతులు, ధర్మపరులైన పాండవుల చేతిలో తన సంతానం అయిన కౌరవులు ఖచ్చితంగా మరణిస్తారు కాబట్టి వారికి స్వర్గప్రాప్తి కలగాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశాడని చరిత్ర చెబుతుంది.


ఇప్పుడు ఈ ప్రదేశం కురుక్షేత్ర, తానేశ్వర్ అనే జంట నగరాలుగా ఉంటుంది. తానేశ్వర్ ఇక్కడున్న స్థానీశ్వరుడి ఆలయం పేరు మీద ఈ పేరు వచ్చింది. దీని సమీపంలోనే అత్యంత పురాతనమైన భద్రకాళి ఆలయం కూడా ఉంది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఉత్తరంగా చండీగఢ్, జమ్మూ వైపు వెళ్లే రైలు మార్గంలో ఈ కురుక్షేత్ర ఉంటుంది. ఢిల్లీ నుంచి దాదాపు 165 కిలోమీటర్లు ఉన్న కురుక్షేత్ర చేరుకోవడానికి ట్రైన్లు ఉంటాయి. బస్సుల్లో వెళ్లాలి అనుకునే వారికి కూడా ఢిల్లీ నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి..అయితే కురుక్షేత్రలో అంతగా కట్టడాలేమీ లేవు. బ్రహ్మసరోవరం అనే ఓ కొలను ఇంకా దాని ఒడ్డునే లక్ష్మీనారాయణుడి పురాతన ఆలయం ఉంటుంది. అప్పట్లో చాలా పెద్దదిగా ఉండే ఈ కొలనును పునర్నించారు. ప్రస్తుతం దీని పొడవు 1170 మీటర్లు ఉంటుంది. ఇక్కడ స్నానమాచరించడాన్ని పుణ్యప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా గ్రహణ స్నానాలు చేస్తుంటారు. 


ఉత్తర ప్రదేశ్ లో చాలా ప్రాంతాల నుంచి గ్రహణం రోజు వచ్చి స్నానమాచరించే భక్తులతో కురుక్షేత్రలో ఉన్న బ్రహ్మరసరోవరం అంతా కూడా నిండిపోతుంది. ఈ ప్రదేశానికి దగ్గరలో కొన్ని ఆలయాలు నిర్మించారు. కురుక్షేత్ర నుంచి దూరంగా ఓ చిన్న ఆలయానికి ఆనుకుని దిగుడుబావి లాంటి ఓ కొలను ఉంటుంది. కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత అంపశయ్య మీదున్న భీష్ముడి దాహం తీర్చేందుకు అర్జునుడు వేసిన బాణం ద్వారా ఆ కొలను ఏర్పడిందని చరిత్ర చెబుతుంది. కురుక్షేత్రకి మరోవైపు జ్యోతి సర్ అని మరో కొలను ఒడ్డున అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసినట్టు స్థలం. బ్రహ్మ సరోవరం ఒడ్డునే ఉండే రోడ్డుకు రెండో వైపు బిర్లా ధర్మశాల, జాట్ అనే ధర్మశాలలున్నాయి.  యుద్ధం జరిగిన ప్రదేశంలో భూమి అప్పుడు మరణించిన లక్షలాది సైనికుల రక్తంతో తడిచి ఇప్పటికీ కూడా ఎర్రగా ఉంటుంది. అందుకే మహాభారతం పై ఆసక్తి ఉన్న టూరిస్టులు ఇక్కడకి వచ్చి సందర్శిస్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: