మహా భారతంలో కురుక్షేత్ర యుద్ధం ఈ భూమీ మీద జరిగిన అతి భయంకరమైన యుద్ధం. ద్వాపర యుగంలో జరిగిన ఈ యుద్ధం మొత్తం 18 రోజులు జరిగింది. కురుక్షేత్రం అనేది ఒక ప్రదేశం. ఒక యుద్ధ భూమి. ఆ ప్రదేశంలో పాండవులు, కౌరవులు మధ్య భీకర యుద్ధం జరిగింది. ఇలాంటి భయంకర యుద్ధం ఇంకొకటి లేదని చరిత్ర నమ్ముతుంది. అయితే కురుక్షేత్రం అంటే కేవలం మహాభారత యుద్ధం జరిగిన స్థలం మాత్రమే కాదు. ఇప్పటి హర్యానా రాష్ట్రంలో ఉన్న ఆ ప్రదేశానికి ఓ విశిష్టత ఉందని స్థలపురాణం చెబుతోంది.ద్వాపరయుగం కన్నా ముందు అంటే శ్రీ కృష్ణుడు పుట్టకముందు ఈ ప్రదేశానికి కురు అనే రాజు వచ్చాడు.అయితే ఆ చుట్టుపక్కల 8 నదులు పరవళ్లు తొక్కుతూ ప్రవహించడం చూసిన ఆ రాజు..తన బంగారు రథం నుంచి కిందకు దిగి వచ్చి నాగలిని తయారు చేశాడు. ఆ తర్వాత శివుడిని పూజించి నందిని, యముడిని ప్రార్థించి మహిషాన్ని తీసుకొచ్చి ఆ నాగలికి కట్టి భూమిని దున్నడం ప్రారంభించాడు.
అయితే అక్కడకు వచ్చిన ఇంద్రుడు.. ఏం చేస్తున్నావని ప్రశ్నించాడు. సత్యం, దయ, క్షమ, దానం, స్వచ్ఛత, నిష్కామం, బ్రహ్మచర్యం ఇంకా యోగం అనే 8 పంటలు పండించేందుకు ఉపక్రమిస్తున్నానని చెప్పాడు ఆ కురు రాజు. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు దేవుడు స్వయంగా దిగివచ్చి అదే ప్రశ్న అడిగితే..మళ్లీ అదే సమాధానం చెప్పాడు ఆ కురు మహారాజు. అయితే విత్తనాలు లేవని అడిగితే..తన శరీరాన్ని అప్పగించాడు. అప్పుడు ఏవరం కావాలో కోరుకోమనడంతో కురు రాజు ..వెంటనే తాను మరణించిన తర్వాత ఈ ప్రదేశం తనపేరుతో వర్థిల్లాలని..ఇక్కడ చని పోయిన ప్రతి ప్రాణి కూడా స్వర్గానికి చేరుకోవాలన్నాడు. అతను చెప్పినట్లు సరే అని వరమిచ్చాడు శ్రీ మహా విష్ణువు. అలా కురు రాజు క్షేత్రంగా మలచాలి అనుకున్న ఈ ప్రదేశం కురుక్షేత్రం అయింది. ఇది ఇప్పుడు హర్యానా రాష్ట్రంలో ఉంది. మహా భారతం కాలంలో ఈ ప్రదేశంలోనే పాండవులకు, కౌరవులకు యుద్ధం జరిగింది. కాబట్టి దీన్ని కురుక్షేత్ర యుద్ధం అంటారని చరిత్ర చెబుతుంది.