శరీరంలో వేడి బాగా పెరిగిందా? అయితే ఇలా చేయండి!
పూర్వకాలంలో మన పెద్దలు రాగిజావ, రాగిసంకటి, బెల్లం పానకం, మజ్జిగ, నానబెట్టిన సజ్జలు అంటూ ఇలాంటివి ఎన్నో ఆహారంలో భాగంగా తీసుకునేవారు. ప్రస్తుత కాలంలో ఈ మధ్య చాలా మంది ఇవన్నీ తినడానికి ఇష్టపడరు. బర్గర్,పిజ్జా లంటూ బేకరీలో చుట్టూ తిరుగుతున్నారు. ఫాస్ట్ ఫుడ్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి వారిలో శరీరంలో వేడి ఎక్కువగా ఉంటుంది. దాన్ని తగ్గించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా తగ్గటం లేదంటూ వారు వాపోతున్నారు. ఇలా శరీరంలో వేడి చేయడం వల్ల చర్మం మీద పొక్కులు ఏర్పడడం, కడుపులో మంట, నోటి పూత, నీరసంగా అనిపించడం ఇలాంటి ఎన్నో సమస్యలకు గురవుతుంటారు.
ప్రస్తుతం వారి వారి పనులలో వారికి నీరు తాగడానికి కూడా సమయం లేనంతగా బిజీ అయిపోతున్నారు.చాలామంది పండ్లు తినడానికి కూడా ఇష్టపడరు. ఇలాంటి వారి శరీరంలో తప్పకుండా వేడి పెరిగి అనేక ఇబ్బందులకు దారితీస్తోంది. ఇప్పుడు మనం చర్చించుకోబోయే చిట్కాల ద్వారా శరీరంలో వేడిని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.
శరీరంలోని వేడి తగ్గాలంటే రోజు తాగే నీటి శాతం కన్నా రెట్టింపు భాగంలో నీటిని తాగాలి. నీటిని ఎక్కువగా తాగడానికి ఇష్టపడనివారు నీరు శాతం ఎక్కువగా కలిగిన తాజా పండ్లు తీసుకోవడం మంచిది. అందులో ముఖ్యంగా కర్బూజ, పుచ్చకాయ, ద్రాక్ష, దానిమ్మ లాంటి పండ్లను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. వీటిని తినడం వల్ల శరీరానికి కావలసినంత నీరు అంది, వేడి నుంచి కొంత ఉపశమనం పొందవచ్చు.
ప్రతి రోజు ఉదయాన్నే కాఫీ, టీ అంటూ పరుగులు పెట్టే బదులు ఒకసారి రాగి జావ తాగి చూడండి. శరీరంలో వేడి ఇట్టే తగ్గిపోతుంది.అంతేకాకుండా చల్లని మజ్జిగలో కొద్దిగా ఉప్పు,పుదీన కలుపుకొని తాగడం వల్ల శరీరంలో వేడి తగ్గే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మొలకెత్తిన గింజలను తినడం వల్ల కూడా శరీరంలో వేడిని తగ్గించుకోవచ్చు.మెంతులను పొడిచేసుకొని తాగిన వేడి నుంచి ఉపశమనం కలుగుతుంది.
శరీరంలో వేడి కారణంగా చాలామందిలో తలనొప్పి, మలబద్ధకం లాంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటివారు ఛాతీ మీద,మణికట్టు మీద ఐస్ తో రాసుకుంటే ఉపశమనం కలుగుతుంది. అలోవెరా గుజ్జుకు కూడా శరీరంలో వేడిని తగ్గించే లక్షణం కలిగి ఉంది. కాబట్టి ఉదయాన్నే అలోవెరా గుజ్జును తీసుకోవడం వల్ల వేడి నుంచి తప్పించుకోవచ్చు.గాలి తగలని ప్రదేశంలో ఎక్కువసేపు ఉండటం వల్ల వేడి చేసే ప్రమాదం ఉంది. అందుచేత శరీరానికి ఎక్కువ గాలి తగిలేలా చూసుకోవాలి. కాబట్టి పైన చెప్పిన పద్ధతులు పాటించి శరీరంలో వేడిని తగ్గించుకోవచ్చు.