నిరుద్యోగులకు కేసీఆర్ గుడ్‌న్యూస్‌.. పది రోజుల్లోనే?


తెలంగాణ సీఎం కేసీఆర్‌ నిరుద్యోగులకు ఓ గుడ్‌ న్యూస్ చెప్పారు.. ఇప్పటికే 80 వేల ఉద్యోగాలు త్వరలోనే భర్తీ చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన కేసీఆర్‌ ఇప్పుడు ఆ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే ఇవ్వాలని అధికారులకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. వారం, పది రోజుల్లో నోటిఫికేషన్లు జారీ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఆలస్యం చేయకుండా ప్రక్రియ పూర్తి చేసి నోటిఫికేషన్లు ఇవ్వాలని సీఎం  కేసీఆర్‌ చెప్పారు.

10 రోజుల్లో మొత్తం 30 వేల ఉద్యోగాల వరకూ నోటిఫికేషన్లు ఇవ్వాలని కేసీఆర్‌ ఆదేశించారు. దశలవారీగా మిగతా పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. వాస్తవానికి కేసీఆర్‌ టీవీల ముందు కూర్చుని చూడండి గుడ్‌ న్యూస్ చెబుతా అని ఊరించి మరీ అసెంబ్లీలో ప్రకటన చేశారు. అంతే కాదు.. ఇవాళే నోటిఫికేషన్లు వస్తాయని కూడా ఉత్సాహంగా కేసీఆర్ చెప్పిన తీరు చూసి నిజంగానే నిరుద్యోగులు డంగైపోయారు.. అవునా అంటూ ఆశ్చర్యపోయారు.

కానీ ప్రభుత్వ పెద్దల ఉత్సాహపు ప్రకటనలు తప్ప ఒక్క నోటిఫికేషన్ కూడా ఇప్పటి వరకూ విడుదల కాలేదు. నోటిఫికేషన్‌ వచ్చే వరకూ కేసీఆర్‌ ఉద్యోగాల మాటలు నమ్మలేమని కూడా కొందరు నిరుద్యోగులు కామెంట్ చేశారు.. కేసీఆర్ గతంలోనూ ఇలాంటి ప్రకటనలు చేసి అమలు చేయని చరిత్ర ఉన్న కారణంగా దీన్ని కొందరు నిరుద్యోగులు నమ్మలేదు కూడా. అయితే అసెంబ్లీలో చెప్పాక.. చేయాల్సిందేనని.. అందులోనూ ఎన్నికలు రాబోతున్నందున నోటిఫికేషన్లు వేసి తీరతారని చాలా మంది నమ్ముతున్నారు.

ఇప్పటికే కొందరు ప్రిపరేషన్ ప్రారంభించగా.. ఇంకొందరు మాత్రం నోటిఫికేషన్ రానీ.. వచ్చాక చూద్దాం అన్న ఆలోచనలో ఉన్నారు. అందుకే వారం పది రోజుల్లో కనీసం 30 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించడం నిరుద్యోగులకు ఆనందాన్నిచ్చేదే.. కానీ అసలైన నోటిఫికేషన్‌ వస్తేనే క్లారిటీ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: