పుస్తక పఠనమే వ్యక్తిత్వ వికాసానికి నాంది.. ఎందుకంటే..!

MOHAN BABU
పుస్తక పఠనమే వ్యక్తిత్వ వికాసానికి పునాది అని డా. బి.ఆర్ అంబేద్కర్,ఏపీజే అబ్దుల్ కలాం,స్వామి వివేకానంద లాంటి మహనీయులు సూచించారు. ప్రపంచంలో పేరు ప్రఖ్యాతలు పొందిన వారంతా నిరంతర పుస్తక ప్రేమికులే.తమ జీవితకాలంలో సగభాగం లైబ్రరీలోనే గడిపిన వారు ఉన్నారు.స్వాతంత్ర ఉద్యమంలో కూడా గ్రంథాలయాల ద్వారా ప్రజలలో చైతన్యం తీసుకురావాలని మాడపాటి హనుమంతరావు, వట్టికోట ఆళ్వారుస్వామి, కోదాటి నారాయణరావు తదితరులు కృషి చేశారు. నాటి చరిత్రను కూడా నేడు పుస్తకాల్లో చదువుతున్నాం.

గతంలో రాజులు సింహాసనాన్ని అధిష్టించే ముందు లోకజ్ఞానం కోసం రాజ్యాంగ పర్యటనకు బయలుదేరేవారు.ఒక ప్రాంతాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించే వారికి సామాజిక స్పృహ అవసరం. ప్రస్తుత కాలంలో బయటి ప్రపంచం గురించి తెలుసుకోవాలని ఎంత ఆరాటం చెందుతున్న ఆర్థిక పరిస్థితులు ముందుకు సాగనివ్వడం లేదు. అటువంటి వారికి పుస్తకపఠనం ఉపయోగపడుతుంది. వర్తమాన  విషయాల మీద విశ్లేషణ చేయవచ్చు. సమసమాజ నిర్మాణంలో వారి ఆలోచనలను వ్యక్తపరచవచ్చు. నేడు ఉన్నత చదువులు ఎన్ని చదివినా విషయ పరిజ్ఞానం మాత్రం లేదు. దీంతో భవిష్యత్ తరాల వారికి మేధావులను అందించలేక పోతున్నాం. పుస్తకాలు చదివే వారి సంఖ్య క్రమంగా తగ్గుతుందని వివిధ అధ్యయనాలు తెలుపుతున్నాయి. ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు ఏదైనా ఒక అంశం గురించి తెలుసుకోవాలంటే పెద్దలతో చర్చించే వారు లేదా లైబ్రరీలలో వెతికేవారు. అటువంటి కాలం నుంచి సెకనులో గూగుల్లో సెర్చ్ చేసి సమాచారం సేకరిస్తున్నారు.కవులు, రచయితలు కూడా ఫోన్ ఉపయోగిస్తున్నారు. పుస్తకాలకు ఆదరణ చాలావరకు తగ్గిపోయింది. చరిత్ర,సంస్కృతిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఏటా హైదరాబాద్ నడివొడ్డున ఎన్టీఆర్ స్టేడియంలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు అవుతుంది.

 పాఠశాల,కళాశాలల విద్యార్థులు కూడా దీన్ని సందర్శిస్తున్నారు. పిల్లలు, పెద్దలు కొంత సమయం పుస్తక పఠనానికి కేటాయించడం ద్వారా మానసిక ఒత్తిడి దరిచేరదని బ్రిటన్ యూనివర్సిటీ తెలిపింది. ప్రపంచంలో వివిధ రంగాల్లో ఉన్నతంగా స్థిరపడిన వారు వారి దినచర్య లో కొంత సమయాన్ని పుస్తక పఠనానికి కేటాయిస్తారు. చిన్నప్పటి నుండి పిల్లలకు పుస్తకాలు చదవడం అలవాటు చేయాలని, పుస్తక పఠనం ద్వారా విషయ పరిజ్ఞానమే కాకుండా వ్యక్తిత్వ వికాసం పెంపొందుతుందని  నిపుణులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: