కరోనాతో కనాకష్టంగా విద్యార్థుల చదువులు!

N.Hari
క‌రోనా మ‌హ‌మ్మారి పుణ్యాన గ‌త రెండేళ్లుగా విద్యావ్యవ‌స్థ చిన్నాభిన్నం అవుతూనే ఉంది. కొంత మేర వృత్తి విద్యా కోర్సుల‌ను ఎలాగోలా బండి లాగిస్తున్నా... ప్రాథ‌మిక‌, ప్రాథ‌మికోన్న‌త విద్యావ్య‌వ‌స్థ‌పై బాగా ప్రభావం ప‌డింది. గ‌త రెండేళ్లుగా అస‌లు విద్యార్థులు ఎలా చ‌ద‌వుకుంటున్నారు... ఆన్ లైన్ విద్యావిదానం ఎలా ఉప‌యోగ‌ప‌డుతోంది.. అస‌లు ఆన్ లైన్ వ‌ల్ల ఏమైనా ఉప‌యోగాలు ఉన్నాయా అనే అంశంపై ప‌లు స్వ‌చ్చంద సంస్థ‌లు నిర్వ‌హించిన స‌ర్వేల్లో ఆస‌క్తి క‌ర అంశాలు వెల్ల‌డయ్యాయి. దాదాపు 44 శాతం మంది విద్యార్థులు పూర్తిగా పాఠ్యాంశాల‌పై గ్రిప్ కోల్పోగా, కేవ‌లం 25శాతం మంది విద్యార్థులు మాత్ర‌మే అడ్వాన్సుడ్ విద్యా విధానం అందుబాటులోకి వ‌స్తే బాగుండ‌ని కోరుకుంటున్న‌ట్లు స‌ర్వే రిపోర్టులు చెబుతున్నాయి.
తెలంగాణ‌తో పాటూ దేశంలో ప‌లు రాష్ట్రాల్లో విద్యావిధానంపై ప్రైవేట్ బ‌డ్జెట్ పాఠ‌శాల‌ల జాతియ సంఘం- నిసా ఒక స‌ర్వే నిర్వ‌హించింది.  ఒక ప్రత్యేక ప్రశ్నావళిని రూపొందించి 1502 మంది విద్యార్థుల అభిప్రాయాలను సేకరించారు. విద్యార్థులలో కరోనా సమయంలో ఏర్పడిన లర్నింగ్ లాస్, లర్నింగ్ పావర్టీని అంచనావేయడం వేశారు. గ్రామీణ ప్రాంతం నుండి 416 మంది విద్యార్థులు, సెమీ అర్బన్ నుండి 155 మంది విద్యార్థులు , పట్టణ ప్రాంతం నుండి 860 విద్యార్థులు మరియు 36 మంది విద్యార్థులు ఇంటర్నేషనల్ పాఠశాలల నుండి ఈ సర్వేలో భాగ‌స్వాముల‌ను చేశారు . 3, 5, 8వ తరగతుల విద్యార్థులలో లర్నింగ్ లాస్ మరియు లర్నింగ్ పావర్టీని అంచనా వేశారు. మాతృ భాష, ఇంగ్లీష్, గణితంలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో 30 శాతం మంది విద్యార్థులు , గ్రామీణ ప్రాంతాలలో 24 శాతం విద్యార్థులు మాతృభాషను చదవడంలో ఇబ్బందిని ఎదుర్కొంటున్నారని పరిశోధనలో తేలింది.
ఇక 3వ తరగతిలో 28 శాతం, 5వ తరగతిలో 25 శాతం, 8వ తరగతిలో 2 శాతం విద్యార్థులకు మాతృభాషలో రాయడం అతిపెద్ద సమస్యగా తేలింది. 35 శాతం పట్టణ విద్యార్థులు రాయడంలో సమస్య ఎదుర్కొంటున్నారు. రాయడంలో సమస్యను ఎదుర్కొంటున్న విద్యార్థులలో 3వ తరగతి విద్యార్థులు 30 నుండి 32 శాతంగా ఉన్నారు. ఇంటర్నేషనల్ స్కూల్స్‌లో 14 శాతం మంది విద్యార్థులు ఉన్న‌ట్లు స‌ర్వేలో వెల్ల‌డైంది. అన్ని తరగతులలో చదవడం కంటే రాయడం అతిపెద్ద సమస్యగా క‌న‌ప‌డుతోందనీ, ప్రతి ముగ్గురిలో ఒకరు గణితంలో తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్నట్లు తేలింది.
మరోవైపు ఆన్‌లైన్‌ తరగతుల ప్రభావం కూడా విద్యాబోధనపై భారీగానే ప‌డింది.  44.6 శాతం మంది విద్యార్థులు ప్రస్తుత పరిస్థితుల్లో చదవడం కష్టంగా ఉందని, 32.8 శాతం మంది విద్యార్థులు ఆత్మ విశ్వాసంతో చదువును కొనసాగించడం లేదని, 25 శాతం విద్యార్థులు తమకు ఆన్‌లైన్‌ తరగతుల ద్వారా వచ్చిన లర్నింగ్ లాస్‌ను పూడ్చడానికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని కోరిన‌ట్లు ట్రెస్మా ప్ర‌తినిధుల స‌ర్వేలో వెల్ల‌డైంది. ప‌రిస్థితి ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో విద్యార్థులపై ఈ ప్రభావం చాలా ఎక్కువ‌గా ఉంటుంద‌ని విద్యావేత్త‌లు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: