ఆ రెండు పరీక్షలు పాసైతేనే పర్మినెంట్‌!

N.Hari
ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు.. తమకు పర్మినెంట్‌ ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. అయితే ఇదే సమయంలో వారికి మరో పరీక్ష కూడా ఎదురైంది. జగన్‌ సర్కారు నిర్వహిస్తున్న రెండు పరీక్షలు పాస్‌ అయితేనే ఉద్యోగులకు పర్మినెంట్‌ అయ్యే అవకాశముంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు వెలువరించింది. ఇవి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను షాక్‌కు గురిచేశాయి.
ప్రస్తుతం ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.34 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరంతా ప్రస్తుతం ట్రైనింగ్‌ పిరియడ్‌లో ఉన్నారు. ఉద్యోగులకు రెండేళ్లుగా ఉన్న శిక్షణా కాలం గడువు త్వరలో ముగియనుంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం.. ఉద్యోగులను షాక్‌కు గురిచేసేలా ఉత్తర్వులు ఇచ్చింది.
ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్‌ ప్రకారం.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు రెండు దశల్లో పరీక్షలు నిర్వహిస్తారు.  రెండు పరీక్షలు పాస్ అయిన వారికి మాత్రమే ప్రొబేషన్‌ పిరియడ్‌ ఇవ్వనున్నారు.  ఫెయిల్‌ అయినవారికి మరోసారి పరీక్ష నిర్వహిస్తారు.
ఇక గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు రెండు దశల్లో నిర్వహించే పరీక్షలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కండక్ట్‌ చేయనుంది. రెండు దశల పరీక్షలను ఆన్‌లైన్‌ ద్వారా ఏపీపీఎస్సీ నిర్వహించనుంది. ప్రభుత్వ పథకాలు, శాఖాపరమైన అంశాలు, డిజిటల్‌ సేవలు వంటి అంశాల్లో ప్రశ్నలు ఉంటాయని సమాచారం. ఇందుకు సంబంధించి విధివిధానాలను ఏపీపీఎస్సీ త్వరలో ఖరారు చేయనుంది. పరీక్ష ఎన్ని మార్కులకు నిర్వహిస్తారు? ఎంత సమయం? వంటి అంశాలను ఏపీపీఎస్సీ అధికారులు త్వరలో ప్రకటిస్తారని రాష్ట్ర సచివాలయ వర్గాలు తెలిపాయి.
కాగా, జగన్‌ సర్కారుపై గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. తమను ఉద్యోగాల్లోకి తీసుకున్నప్పుడు లేని షరతులు, నిబంధనలను పెట్టి ఇప్పటికే తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు వాపోతున్నారు. చాలీచాలనంత జీతానికి బండెడు చాకిరీ చేయిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. గ్రామాల్లోనే ఉంటూ పని చేయాలని ఒత్తిడి చేసి తీవ్ర మానసిక వేదనకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని బాధలకు ఓర్చుకుని ఉద్యోగాల పర్మినెంట్‌ కోసం ఎదురుచూస్తున్న తమకు.. తాజాగా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు జీర్ణించుకోలేని విధంగా ఉన్నాయని ఉద్యోగులు మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: