
జగన్ మారిపోయాడా.. ! కూటమికి ఇక చూక్కలేనా?
జగన్ లండన్ పర్యటన ముగించుకొని బెంగళూరు తిరిగి వచ్చారు. అనంతరం పార్టీ ముఖ్యులతో సమావేశం అయి కూటమి ప్రభుత్వ హామీలు, వైఫల్యాలపై చర్చించారు. ఎవరు పార్టీ మారినా భయపడనవసరం లేదని.. ఉన్నవారితోనే రాజకీయం చేద్దామని చెప్పుకొచ్చారు. ప్రజల్లో ఉండి వారితో మమేకమై పని చేస్తే తప్పక గుర్తింపు వస్తుందని చెప్పారు.
ఎప్పటి నుంచో అనుకుంటున్న జిల్లాల పర్యటన వాయిదా పడుతూ వస్తోంది. సంక్రాంతి తర్వాత అని ముందుగా ప్రకటించినా సడెన్ గా జగన్ లండన్ టూర్ పెట్టుకోవడంతో కూటమి నేతల నుంచి విమర్శలు మొదలయ్యాయి. దీంతో ఈ సమావేశంలో జిల్లాల పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారు చేశారు. మార్చి 12న వైసీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా వేడుకగా నిర్వహించాలని నిర్ణయించారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ, సీట్ల తగ్గింపు అంశంపై బోరుబాట నిర్వహించాలని పార్టీ నేతలకు జగన్ సూచించారు. పింఛన్ల కోతపై ఆరా తీశారు.
కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ప్రాధాన్యం దక్కక పోవడాన్ని తప్పు పట్టారు. కేంద్రంలో కీలక భాగస్వామిగా ఉన్న టిడిపి ఈ విషయంలో విఫలమైందని అభిప్రాయపడ్డారు. పోలవరం ఎత్తు కుదింపు, నిధుల ప్రకటన అంశం పైన సుదీర్ఘంగా చర్చించారు జగన్. అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై కూడా చర్చలు జరిపారు. బడ్జెట్ సమావేశాలు కావడంతో.. హాజరు కావడమే మంచిదని ఎక్కువ మంది నేతలు అభిప్రాయపడ్డారు.
మరోవైపు జిల్లాల పర్యటనకు సంబంధించి జగన్ స్పష్టత ఇచ్చారు. ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశాలు పూర్తయ్యాక జిల్లాల పర్యటన మొదలు పెడతానని స్పష్టం చేశారు. ఆయా జిల్లాల నేతలతో సమావేశాలు పూర్తిచేసి.. ఉగాది నాటికి జిల్లాల పర్యటన ఉంటుందని స్పష్టత ఇచ్చారు జగన్. అయితే సంక్రాంతి తర్వాత అని ముందుగా ప్రకటించినా ఇప్పుడు ఏకంగా ఉగాది తర్వాత అని చెబుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు మాత్రమే అవుతుంది. కనీసం ఏడాది సమయం ఇచ్చి ప్రశ్నిస్తే బాగుంటుందనే అభిప్రాయానికి జగన్ వచ్చినట్లు తెలుస్తోంది మరోవైపు ఇప్పటి నుంచి జగన్ 2.0 చూస్తారని చెప్పడంతో వైసీపీ అధినేత స్వయంగా చెప్పడంతో ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక మున్ముందు కూటమికి చుక్కలే అని వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.