శెభాష్ రేవంత్.. ! ఈ విషయంలో మీరు సీఎంని మెచ్చుకోకుండా ఉండలేరు..?
తెలంగాణలో ఏడాది క్రితం పాలన పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలవారి సంక్షేమానికి పెద్ద పీట వేస్తుంది. ఏ ఒక్క వర్గాన్ని నిర్లక్ష్యం చేయకుండా వారికి సంబంధించి ఉపాధి అవకాశాలు కల్పించడానికి వారి పురోగతికి దోహదం చేస్తుంది. తాజాగా సమాజంలో వివక్షకు గురవుతున్న దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లకు ఉపాధి కల్పించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగా తెలంగాణ సర్కార్ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల పట్టణంలో ప్రభుత్వ సహకారంతో పెట్రోల్ బంక్ ని ఏర్పాటు చేసి అందులో ట్రాన్స్ జెండర్లు, దివ్యాంగులకు ఉపాధి కల్పించింది. రెండున్నర కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని గవర్నమెంట్ మెడికల్ కళాశాల సమీపంలో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేశారు. ఇందులో ఒక ట్రాన్స్ జెండర్ తో పాటు 24 మందికి ఉపాధి కల్పించారు. ఈ బంక్ ను నిర్వహించడం కోసం వారికి ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇచ్చారు. వీరంతా ప్రభుత్వం తీసుకున్న చొరవ కారణంగా ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు.
ఇక రాష్ట్ర ప్రభుత్వం తమ వంటి వారి గురించి ఆలోచించి ఉద్యోగాలు కల్పించడం తమకు ఉపాధిని ఇచ్చిందని దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్ లు చెబుతున్నారు. అంతేకాదు తమకు జీవనోపాధి కలిగించి తమ కాళ్ళపై తమ నిలబడేలా చేసిందని ప్రభుత్వానికి ఓ దివ్యాంగురాలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పెట్రోల్ బంక్ లో ఉద్యోగం చేయడం వల్ల దాదాపు 18 వేల రూపాయల జీతం వస్తుందని దీనివల్ల తాము సంతోషంగా జీవించగలుగుతున్నామని తెలిపారు.
ఇక ఇదే తరహాలో వివిధ జిల్లాలలో కూడా ట్రాన్స్ జెండర్లకు, దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఆయా జిల్లాల అధికార యంత్రాంగం ప్రయత్నాలు సాగిస్తోంది. రేవంత్ సర్కార్ రాష్ట్రంలో ఏ వర్గాన్ని నిర్లక్ష్యం చేయకుండా, వివక్షతో చూడకుండా అన్ని వర్గాలకు సముచితమైన స్థానాన్ని కల్పించి వారి పురోగతికి దోహదం చేస్తున్నారని చెప్పడానికి ఇదే మంచి ఉదాహరణ.