పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బీజేపీని ఇరుకున పడేశాయా? కాంగ్రెస్ పార్టీ మైలేజ్ పెరిగిందా?

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిరవధికంగా శుక్రవారం వాయిదా పడ్డాయి.  నవంబర్ 25 నుంచి ప్రారంభమైన ఈ సమావేశాలో బీజేపీ అనుకున్న విధంగా బిల్లులను అయితే పాస్ చేయించుకోలేక పోయింది అని అంటున్నారు.  జమిలి ఎన్నికల బిల్లుని ఇదే పార్లమెంట్ లో చర్చకు పెట్టి ఆమోదించుకోవాలని అనుకున్నా విపక్షాల వ్యతిరేకత మధ్యన చివరిలోనే దానిని ప్రవేశపెట్టి జాయింట్ యాక్షన్ కమిటీ ముందుకు పంపించారు.


వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు చట్టం అవుతుందని శీతాకాల సమావేశాలే దానికి ముహూర్తం అని ప్రచారం సాగినా జేపీసీకి మరో మూడు నెలలు గడువు ఇచ్చి దీని మీద అధ్యయనాన్ని కొనసాగించడానికి వీలు కల్పించారు. ఇక పార్లమెంట్ లో రాజ్యాంగం ఆమోదించి 75 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా చర్చ మాత్రం సాగింది.


శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతూనే అదానీ మీద చర్యలకు డిమాండ్ చేస్తూ సభను స్థంభింప చేసేందుకు విపక్షాలు చూస్తూ వచ్చాయి.  దాంతో సభ ప్రతీ రోజూ దాదాపుగా వాయిదా పడుతూనే వస్తోంది. పని గంటలు కూడా గతంతో పోలిస్తే ఈసారి తగ్గాయని అంటున్నారు. రాహుల్ గాంధీ పెద్దగా ఫోకస్ కాలేదు. ప్రియాంకా గాంధీ మొదటిసారి ఎంపీగా నెగ్గి సభకు రావడంతో ఆమె తన ఉనికి బలంగా చాటుకున్నారు. మోడీ ప్రభుత్వం మీద ఆమె ధీటైన విమర్శలు చేశారు అని కూడా అంటున్నారు.


ప్రధాని మోడీ ఈసారి సమావేశాలలో రాజ్యాంగం మీద చర్చలోనే కీలకమైన ప్రసంగం చేశారు.  గత సమావేశాలతో పోల్చితే ఈసారి మోడీ మార్క్ అయితే అంతగా కనిపించలేదు అనే అంటున్నారు. ఈ సమావేశాలలో హైలెట్ ఏంటంటే బీజేపీలో ఎన్డీయేలో కీలకమైన బలమైన నేతగా ఉన్న అమిత్ షాను ఇరుకున పెట్టడం.  ఆయన అంబేద్కర్ మీద చేసిన వ్యాఖ్యలు అంటూ విపక్షాలు సభ లోపలా బయటా కూడా ఆందోళనలు చేశాయి.  


అమిత్ షా పదేళ్ళ పార్లమెంటరీ అనుభవం లో తొలిసారి విపక్షాలకు ఇలా దొరికి ఇబ్బంది పడ్డారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఎన్డీయే ప్రభుత్వాన్ని అదాని ఇష్యూతో మొదలెట్టి అంబేద్కర్ ఇష్యూ దాకా లాగి విపక్షం అయితే వణికించింది అని విశ్లేషిస్తున్నారు.  ఈసారి సమావేశాలలో అయితే బీజేపీ అనుకున్నది సాధించలేకపోయిందా అన్న చర్చ సాగుతోంది. విపక్షం మాత్రం బీజేపీ మనువాద ధోరణిని ఎండగట్టామని సంతృప్తి వ్యక్తం చేస్తోంది.


ఎవరు ఏమి అనుకున్నా ఈసారి శీతాకాల సమావేశాలు మాత్రం ప్రజా సమస్యల మీద పెద్దగా చర్చించలేదని అంటున్నారు. మేధావులు, రాజకీయ నిపుణులు పెదవి విరుస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: