తెలంగాణ ప్రజలకి గుడ్ న్యూస్ చెప్పనున్న రేవంత్..? రేషన్ కార్డులు, సన్న బియ్యం ఎప్పటి నుంచి అంటే..?
రేషన్ కార్డుల విషయంలో గత తెలంగాణ ప్రభుత్వం (బీఆర్ఎస్) పెద్దగా పట్టించుకోలేదు. దీంతో రాష్ట్రంలో చాలా సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు మారలేదు. కాంగ్రెస్ హాయంలోని రేవంత్ ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంది. కొంత కాలం నుంచి ఆశగా ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రజలకు సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీపి కబురు అందించారు.
ఏళ్లుగా కొత్త రేషన్ కార్డులు జారీ కాకపోవడంతో కుటుంబాలు తల్లిదండ్రుల నుంచి వేరుపడిన, కొత్తగా పెళ్లిళ్లు చేసుకున్న వారు నెల నెలా ఇబ్బందులు పడుతున్నారు. అన్ని పథకాలకు రేషన్ కార్డును లింక్ చేయడంతో వాటి కోసం నిరీక్షిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రెండో రోజు మండలిలో సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ విధంగా స్పందించారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా ప్రారంభిస్తామని, సంక్రాంతి నుంచి మంజూరు కూడా ఉంటుందని చెప్పారు. ఇప్పటికే ఈ విషయంపై క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేసినట్లు మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 36 లక్షల మందికి రేషన్ కార్డు మంజూరు చేసే ఆలోచన ఉన్నట్లు వెల్లడించారు. కేవలం కార్డులు ఇచ్చి ఊరుకోకుండా ఈ జనవరి నుంచి సన్నబియ్యం కూడా ఇస్తామని మంత్రి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. రేషన్ కార్డుల మంజూరుపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రభుత్వానికి కొన్ని కీలక సూచనలు చేశారు.
లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. కార్డుల జారీ విషయంలో సివిల్ సప్లయ్ అధికారులు సమగ్ర విచారణ జరపాలని, అలాగే ఇప్పటికే ఉన్న వాటిలో అనర్హులను గుర్తించి తొలగించాలన్నారు. అప్పుడే కొత్తవి, పాతవి బ్యాలన్స్ అయి ప్రభుత్వంపై భారం తగ్గుతుందని చెప్పారు. పేదలకు మాత్రమే సరుకులను పంపిణీ చేయాలని మండలి చైర్మన్ ప్రభుత్వానికి సూచించారు.
ప్రస్తుతం 89.96 లక్షల రేషన్ కార్డులు వినియోగంలో ఉన్నాయి. వీటికి అదనంగా 36 లక్షల కార్డులను ప్రభుత్వం మంజూరు చేయబోతోంది. కొత్త కార్డులు, హెల్త్ కార్డులు విడివిడిగా ఇవ్వాలని నిర్ణయించింది.