జమిలి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న జగన్..! చంద్రబాబు కి చుక్కలేనా?
వైసీపీ అధినాయకత్వమే నీరుగారిపోయిన దారుణమైన ఫలితాలు 2024 ఎన్నికల్లో వచ్చాయి. గట్టిగా చెప్పాలీ అంటే ఆరు నెలలు గడచినా ఈ రోజుకీ అధినాయకత్వమే ఇంకా కోలుకోలేదు. మరో వైపు చూస్తే లీడర్ కి క్యాడర్ కి, అలాగే లీడర్ కి హై కమాండ్ కి మధ్య ఒక వంతెన తెగి చాలా ఏళ్ళు అయింది అన్నది నిష్టుర నిజం అంటున్నారు.
అయిదు నెలల టీడీపీ కూటమి ప్రభుత్వంలో జరిగిన కొన్ని తప్పులు వైసీపీకి కొంత ఓదార్పుని ఇస్తున్నాయి. గతంలో వైసీపీ ప్రభుత్వం చేసిన మాదిరిగానే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తుందని అంటున్నారు.
ఇదిలా ఉంటే కేంద్రం జమిలి ఎన్నికల నినాదం అయితే వైసీపీకి జవ జీవాలను అందిస్తోంది. దాంతో చెల్లా చెదురు అయిన లీడర్లు ఇపుడు మళ్లీ పార్టీ ఫ్లాట్ ఫారం వద్దకు చేరుతున్నారు. అయిదేళ్ళ పాటు అధికార వియోగం అంటే బాబోయ్ అనుకున్న వారు అంతా మూడేళ్ళకే మళ్ళీ ఎన్నికలు అందులోనూ ఆరు నెలలు ఇపుడే గడచిపోయాయి కాబట్టి గట్టిగా కళ్ళు మూసుకుంటే రెండున్నరేళ్ళే కాబట్టి ఇప్పటి నుంచే ఫీల్డ్ లో ఉండాలని భావిస్తూ వైసీపీ తో టచ్ లోకి వస్తున్నారు.
జమిలి ఎన్నికల విషయంలో కేంద్రంలోని బీజేపీ పట్టుదలగా ఉండడమే వైసీపీకి కలసి వస్తోంది. ఇది నిజంగా జగన్ ఊహించినది కాదు, ఆయన ఏ రకమైన రాజకీయ వ్యూహాలు రచించినదీ లేదు. ఒక్క మాటగా చెప్పుకుంటే నిజంగా జమిలి ఎన్నికలు అని కేంద్రం ప్రకటించకపోయి ఉంటే వైసీపీ పరిస్థితి ఏమిటి అన్నది కూడా చర్చకు వచ్చే విషయమే.
షెడ్యూల్ ప్రకారం 2029 ఎన్నికలు అంటే వైసీపీలో ఉండేవారు ఎవరో రాజెవరో మంత్రి ఎవరో అన్న సీన్ కనిపించేది. ఎంత జగన్ ప్రజాకర్షణ నేత అనుకున్నా క్యాడర్ లీడర్ లేకుండా ఎన్నికలను ఎదుర్కోలేరు కదా అన్నది కూడా చూడాలి. ఏది ఏమైనా నిజంగా 2027లో ఎన్నికలు జరగవచ్చు లేక ఆగవచ్చు. కానీ అప్పటిదాకా ఆ రాగాలాపన ఉంటుంది అన్నది కచ్చితం.
ఎందుకంటే అక్కడ నుంచి 2029 ఎన్నికలు కేవలం రెండేళ్ళే. సో వైసీపీకి ఆయాచిత వరంగా కేంద్రంలోని బీజేపీ ఈ రాజకీయ సాయం చేస్తోంది అని అనుకోవాలి.