ఇజ్రాయెల్ కి ముప్పు తప్పదా? ఇరాన్ తో అనవసరంగా పెట్టుకున్న నెతన్యాహూ?

ఇజ్రాయెల్ పై దాడి చేయడం ఖాయమన్న సంకేతాలను ఇరాన్ పంపుతోంది. శనివారం ఇజ్రాయెల్‌ చేసిన దాడిలో ఇరాన్‌కు చెందిన కీలక సైనిక స్థావరాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా క్షిపణి తయారీ కేంద్రాలు, రాడార్‌ వ్యవస్థలు ధ్వంసమయ్యాయి.  ఇరాన్‌ సుప్రీం నేత అయాతుల్లా ఖమేనీ కూడా ఇజ్రాయెల్‌ దాడిని మరీ తక్కువ చేయనక్కర్లేదని వ్యాఖ్యానించారు.  



ఈ నేపథ్యంలో ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ కోర్‌ (ఐఆర్‌జీసీ) జనరల్‌ హొస్సేన్‌ సలామీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌ దాడికి స్పందన తమ దగ్గర నుంచి ఉంటుందని అన్నారు. ఇందుకు అందుబాటులో ఉన్న అన్ని సాధనాలను వినియోగించుకుంటామని చెప్పారు. ఊహించని పర్యవసానాలను ఇజ్రాయెల్‌ ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తమపై ఇజ్రాయెల్‌ చేసిన దాడి అక్రమం.. చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ప్రధాని నెతన్యాహు నివాసంపై ఇటీవల హెజ్‌బొల్లా చేసిన డ్రోన్‌ దాడి ఇజ్రాయెల్‌ భద్రతా వర్గాల్లో కలకలం రేపింది.



ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలను అధికారులు చేపడుతున్నారు. క్యాబినెట్‌ సమావేశాలు ఇక నెతన్యాహు నివాసంలో గానీ సైన్యం కేంద్ర కార్యాలయంలో గానీ నిర్వహించకూడదని నిర్ణయించారు. సోమవారం జరిగిన క్యాబినెట్‌ సమావేశాన్ని అంతగా ఎవరికీ తెలియని ఓ భవనంలో నిర్వహించారు. ఈ భవనానికి కారు పార్కింగ్‌ సౌకర్యం కూడా లేదని తెలుస్తోంది.



గాజాలోని బీట్‌ లాహియాలోని కమల్‌ అద్వాన్‌ ఆస్పత్రిలోని భూగర్భంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్న దృశ్యాలను ఇజ్రాయెల్‌ సైన్యం (ఐడీఎఫ్‌) విడుదల చేసింది. ఈ ఆస్పత్రిని ఐడీఎఫ్‌ ఇటీవల తన అధీనంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అక్కడ సుమారు 100 మంది హమాస్‌ మిలిటెంట్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. ఇందులో ఆస్పత్రిలో పనిచేస్తున్న 44 మంది పురుష సిబ్బంది కూడా ఉన్నారని పేర్కొంది. కమల్‌ అద్వాన్‌లోని 88 మంది రోగులను, వారి సంరక్షకులను, సిబ్బందిని గాజా స్ట్రిప్‌లోని వేరే ఆస్పత్రికి తరలించినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది.



ఇరాన్‌పై దాడి చేసేందుకు ఇజ్రాయెల్‌ తమ గగనతలాన్ని ఉల్లంఘించిందని ఇరాక్‌ ఆరోపించింది. తమ దేశ సార్వభౌమాధికారాన్ని అతిక్రమించిందని చెప్పింది. ఈ మేరకు ఐరాస సెక్రటరీ జనరల్‌కు, ఐరాస భద్రతా మండలికి నివేదిక ఇచ్చి నిరసన తెలిపింది.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: