ప్రాంతీయ పార్టీలకు మోదీ ఝులక్! ఒకే దెబ్బకి రెండు పిట్టలు?

పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలను చట్ట సభలు అంటాం. పార్లమెంట్ లో దేశానికి సంబంధించిన చట్టాలు చేస్తే.. అసెంబ్లీలో ఆయా రాష్ట్రాల ప్రజల కోసం చట్టాలు చేస్తాయి. చట్టాలు చేసే అవకాశం అధికార పార్టీకి మాత్రమే ఉంటుంది. అంటే ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వారికి అన్నమాట. ప్రస్తుతం మన దేశంలో పది వరకు జాతీయ పార్టీలు ఉన్నాయి.


వందకు పైగా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. జాతీయ పార్టీలు ఇటు పార్లమెంట్, అటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీల్లో ప్రాతినిథ్యం వహిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలు మాత్రం రాష్ట్రాలకే పరిమితం. స్థానిక సమస్యలు, ప్రజల ఆకాంక్షల మేరకు ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే అధికారం చేప్టాయి. అయితే తాజాగా  కేంద్రం అమలు చేయబోతున్న జమిలి ఎన్నికలు ప్రాంతీయ పార్టీలకు పెను ముప్పుగా మారబోతున్నాయి.


వన్ నేషన్.. వన్ ఎలక్షన్ నినాదంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చాలా కాలంగా జమిలి ఎన్నికలకు కార్యాచరణ రూపొందించింది. దీనిని ఆచరణలో పెట్టేందుకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ దాదాపు ఏడాది పాటు దేశంలోని జాతీయ, ప్రాంతీయ పార్టీలతో సమావేశం నిర్వహించి నివేదికను కేంద్రానికి సమర్పించగా.. ఇప్పుడు దానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.


వచ్చే శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. అయితే ఈ బిల్లుకు ఆమోదం లభిస్తుందా లేదా అన్నది చూడాలి. ఎన్డీయే కూటమిలో జేడీయూ, టీడీపీలు కీలకంగా ఉన్నాయి. బిల్లు ఆమోదం పొందాలంటే 270 మంది ఎంపీల మద్దతు అవసరం. కానీ బీజేపీకి 235 మంది మాత్రమే సభ్యులు ఉన్నారు. ఇక రాజ్యసభలోను అదే పరిస్థితి. ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల ప్రజలు ప్రాంతీయ పార్టీల కన్నా జాతీయ పార్టీల వైపే మొగ్గు చూపుతారు అని విశ్లేషకులు అంటున్నారు. దీంతో క్రమంగా చట్టసభల్లో ప్రాంతీయ పార్టీల ప్రాతినిథ్యం తగ్గుతుందని అంటున్నారు. అదే సమయంలో చట్టాల రూపకల్పనలోను ప్రాంతీయ పార్టీల భాగస్వామ్యం తగ్గుతుందని హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: