కేటీఆర్ కి అలా చెక్ పెట్టిన రేవంత్?
కొద్ది రోజులుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మరికొందరు నేతలు తొందర్లోనే ఉప ఎన్నికలు వస్తాయని పదే పదే అంటున్నారు. ఈ మేరకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నారు. ఈ ఉప ఎన్నికల్లో తమ తడాఖా చూపాలని అంటున్నారు. అసలు ఉప ఎన్నికలు దేనికి వస్తాయంటే…
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై హై కోర్టు అనర్హత వేటు వేయిస్తుంది కాబట్టి ఉప ఎన్నికలు తప్పవని కేటీఆర్ ఆశిస్తున్నారు. ముగ్గురు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. అప్పటి నుంచి ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ నాయకులు ధీమాగా చెబుతున్నారు. అయితే తాజా పరిస్థితిని చూస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ ఆశలపై నీళ్లు చల్లినట్లే కనిపిస్తోంది.
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కాదని రేవంత్ చేసిన ప్రకటనతో బీఆర్ఎస్ ఆత్మరక్షణలో పడింది. ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ పదవిని స్పీకర్ గాంధీకి అప్పజెప్పారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకి ఆ పదవి ఇస్తారని బీఆర్ఎస్ భగ్గుమంది. ఈ క్రమంలో గాంధీ తాను కాంగ్రెస్ లో చేరలేదని బాంబ్ పేల్చారు. ప్రస్తుత అసెంబ్లీ రికార్డుల ప్రకారం గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. ఈ లాజిక్ తో సీఎం రేవంత్ రెడ్డి కొడతారు అని బీఆర్ఎస్ అసలు ఊహించలేదు.
అయితే ఫిరాయింపుల విషయంలో అంతిమ నిర్ణయం స్పీకర్ దే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. స్పీకర్ అనుకోనంత వరకు తానుగా ఏ కోర్టు కూడా ఫిరాయింపుల మీద అనర్హత వేటు వేసే అవకాశం లేదు. ఆ అధికారం స్పీకర్ కు తప్ప మరెవరకీ లేదు. ఎంతకాలమైనా.. ఎన్ని సార్లు అయినా ఫిరాయింపుల విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోమని స్పీకర్ కు కోర్టులు సూచిస్తాయే తప్ప.. తానంతట తానుగా కోర్టు ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయం ఫిరాయింపుదారులకు తెలుసు కాబట్టే వారంతా కూల్ గా ఉన్నారు.