సీటు పోయినా.. పాట్లు త‌ప్ప‌ట్లేదుగా.. జ‌గ‌న్ బాధ‌ విన్నారా..!

RAMAKRISHNA S.S.
- అధికార ప‌క్షాలే కాదు మేథావుల‌కూ జ‌గ‌న్ టార్గెట్‌
- విమ‌ర్శ‌లు తిప్పికొట్ట‌లేక మౌనం మౌనంగా జ‌గ‌న్‌
- పార్టీ నేత మౌనంపై వైసీపీ వ‌ర్గాల్లోనే విస్మ‌యం
( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )
అధికారం కోల్పోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి విమర్శల పాలవుతున్నారు. ప్రధానంగా కూటమి పార్టీలు ఎలాగూ విమర్శలు చేస్తాయి. ఇది సహజం. రాజకీయ వర్గాల్లో ఎప్పుడూ ఉండే విధానమే. గత పాలనను విమర్శించడం, గత ముఖ్యమంత్రిని విమర్శించడం అధికారపక్షంలో ఉన్న వాళ్ళు చేసే పని. అయితే దీనికి భిన్నంగా ఇప్పుడు మేధావులు కూడా జగన్మోహన్ రెడ్డిని ఇంకా వదిలిపెట్టకపోవడం గమనార్హం. వాస్తవానికి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను కొంతమంది మేధావులు వ్యతిరేకించిన విషయం అందరికీ తెలిసిందే.

ఈ క్రమంలోనే మేధావి సంఘాలు సైతం పుట్టుకొచ్చాయి. ఆయన పాలనపై ఫిర్యాదులు చేశాయి. ఎన్నికల సమయంలో వ‌లంటీర్లను కూడా అడ్డుకున్న  పరిస్థితిని మనం గమనించాం. ఇది అయిపోయింది. అయితే ఇప్పటికీ కూడా మేధావి వర్గాలు జగన్మోహన్ రెడ్డిని కీలకంగా టార్గెట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలన అడ్డుపెట్టుకుని వ్యక్తిగతంగా ఆయనపై విమర్శలు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఆయన పుంజుకునే అవకాశం ఉందని ఆలోచిస్తున్నారా? లేకపోతే 40% ఓటు బ్యాంకు ఉంది కాబట్టి దాన్ని మరింత తగ్గించాలనే వ్యూహంతో ముందుకు కదులుతున్నారా? అనేది చర్చనీయాంశం.

ఇక అధికారంలో ఉన్నప్పుడు ఒకరకంగా వ్యవహరించిన జగన్ అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే విధానాన్ని పాటిస్తున్నారు. ఇది కూడా రాజకీయంగా పార్టీని ఇబ్బందుల పాలు చేస్తోంది. ఉదాహరణకు తాజాగా చంద్రబాబునాయుడు మూడు శ్వేత పత్రాలు విడుదల చేశారు. పోలవరం అమరావతి విద్యుత్ రంగానికి సంబంధించిన అంశాలపై ఆయన మూడు శ్వేత పత్రాలు విడుదల చేసి.. జగన్ హయాంలో తప్పులు జరిగాయని అక్రమాలు జరిగాయని చెప్పుకొచ్చారు. పోలవరాన్ని పట్టించుకోలేదు కాబట్టి వెనక్కి పోయిందని వ్యాఖ్యానించారు.

దీనిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు పార్టీ నాయకులు కార్యకర్తలు సంసిద్ధంగా ఉండాలని కూడా చంద్రబాబు పిలుపునిచ్చారు. త్వరలో  జిల్లాల పర్యటన చేయనున్నానని ఈ శ్వేత పత్రాలపై పెద్దఎత్తున ప్రజల్లోకి తీసుకు వెళ్తానని చెప్పారు. ఇలాంటి సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి తన పాత విధానాన్ని ఎక్కడా విడిచిపెట్టడం లేదు, వాస్తవానికి గతంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం పై జగన్మోహన్ రెడ్డి విమ‌ర్శ‌లు  చేసినప్పుడు చంద్రబాబు వెంటనే రియాక్ట్ అయ్యారు. ఏ క్షణానికి ఆ క్షణం ఆయన అప్రమత్తంగా వ్యవహరించారు. ఉదయం జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేస్తే ఒక గంట తర్వాత చంద్రబాబు దానికి కౌంటర్ ఇచ్చిన పరిస్థితి గడిచిన ఐదేళ్లలో మనం అందరం చూసాం.

కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. జగన్మోహన్ రెడ్డి అసలు స్పందించటమే లేదు. దీన్ని బట్టి ఆయన పాలనలో అన్ని తప్పులు జరిగాయా అనే సంకేతాలు బలంగా ప్రజల్లోకి వెళుతున్నాయి. మరోవైపు కమ్యూనిస్టులు కూడా జగన్ మోహన్ రెడ్డిని ఇంకా విమర్శిస్తున్నారు. వాస్తవానికి అధికారం కోల్పోయిన పార్టీని కమ్యూనిస్టులు పట్టించుకోరు. అధికారంలో ఉన్న పార్టీని మాత్రమే టార్గెట్ చేస్తారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవాలని డిమాండ్ చేస్తారు . అదేవిధంగా ప్రభుత్వ పాలనను గమనించి లోపాలను ఎండగడతారు. ఇది కమ్యూనిస్టుల విధానం. కానీ దీనికి విరుద్ధంగా ఏపీలో ఇప్పుడు గడిచిన వైసిపి ఐదేళ్ల పాలనను టార్గెట్ చేస్తూ కమ్యూనిస్టు నాయకులు రోడ్డు ఎక్కుతున్నారు. జగన్ హయాంలో రాష్ట్రం నాశనం అయిందని, జగన్ హయాంలో అక్రమాలు జరిగాయని వారు ఇప్పటికీ విమర్శ‌లు చేస్తూ మీడియా మీటింగ్  పెడుతూ జగన్ ను తీవ్రస్థాయిలో
ఎండబెడుతున్నారు.

ఇవన్నీ జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ స్పందించడం లేదు. మరి అని ఏ ఉద్దేశంతో ఉన్నారు? అటు మేధావులు ఇటు కమ్యూనిస్టులు ఇతర పార్టీలు సైతం జగన్ను టార్గెట్ చేస్తున్నా ఆయన ఎందుకు మౌనంగా చూస్తూ ఊరుకున్నారు? అనేది రాజకీయ వర్గాల్లో విస్మ‌యం కలిగిస్తోంది. ఏమున్నా ప్రజలే తేల్చుకుంటారు అని ఆయన అనుకున్నారా? ఇదే నిజమైతే తాజా ఎన్నికల్లో ప్రరాభ‌వం ఏర్పడింది. ఏం జరిగినా ప్రజలు నా వైపే ఉన్నారు అనుకున్న‌ జగన్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇలాంటి సందర్భాన్ని కూడా ఆయన గుర్తు చేసుకోకుండా మౌనంగా ఉండటం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లోనే కాదు సొంత పార్టీ వర్గాల్లోనూ విస్మయాన్ని రేకెత్తిస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: