అమర్‌నాథ్‌కు బుద్దొచ్చింది.. జగన్ ఎప్పుడు మారతారో?
అయితే.. అప్పటి కూల్చివేతలే తమ కొంప ముంచాయని ఇప్పుడు వైసీపీ నేతలు గ్రహిస్తున్నారు. అధికారంలో ఉండగా తమ ప్రభుత్వం చేసిన కూల్చివేతల వల్లే నేడు ఇక్కడ కూర్చోవాల్సి వచ్చిందని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ నిన్న కామెంట్ చేశారు. అలా చేయకపోయి ఉంటే.. ఈ రోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తూ ఉండే వాళ్లం అని ఆ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ విలేకరులతో అన్నారు.
విశాఖలోని ఎండాడ న్యాయ కళాశాల రోడ్డులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మీడియాతో మాట్లాడారు. అక్కడి వైసీపీ కార్యాలయానికి అనుమతులు లేవని అధికారులు నోటీసులు అంటించారు. అనుమతుల అంశంపై కార్యాలయం గోడకు జీవీఎంసీ అధికారులు అంటించిన నోటీసును మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చదివారు. ఆ తరువాత ఆ నోటీసులను ఆయన తొలగించారు.
మొత్తానికి మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కు తమ కూల్చివేతల పాలనే తమ కొంప ముంచిందని అర్థం చేసుకున్నారు. అయితే పార్టీ అధినేత జగన్ మాత్రం ఇంకా.. తాము ఎంతో మంచి చేసినా ప్రజలు తమను ఓడించారన్నట్టుగా మాట్లాడుతున్నారు. జగన్ ప్రభుత్వం ఎంతో మంచి చేసింది నిజమే. కానీ.. తాము చేసిన మంచి గురించే తప్ప.. తాము చేసిన తప్పుల గురించి మాత్రం జగన్ ఇంకా ఆలోచిస్తున్నట్టు కనిపించట్లేదు. కానీ తప్పులు కూడా తెలుసుకున్నప్పుడే వాటిని దిద్దుకునే అవకాశం వస్తుందని జగన్ గ్రహించాల్సి ఉంటుంది.