టార్గెట్‌ 2029.. పక్కా ప్లాన్‌ రెడీ చేస్తున్న రాహుల్‌ గాంధీ?

సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి అధికారం సాధించలేకపోయినా.. దేశ రాజకీయాల్లో ఇండియా కూటమి బలమైన ప్రభావం చూపింది. ఎన్నికలకు ముందు కొన్ని విభేదాలు తలెత్తినా కూటమిలో విభిన్న పార్టీలన్నీ కలిసి కట్టుగా ముందుకు సాగి మంచి ఫలితాలు సాధించాయి. బీజేపీకి సొంతంగా మెజార్టీ రాకుండా ఆయా పార్టీ నేతలు కీలక ప్రచారం నిర్వహించారు. ఓ రకంగా చెప్పాలంటే ఇది వారు సాధించిన విజయంగా చెప్పవచ్చు.

ఏది ఎలా ఉన్నా ఈ సారి ఫలితాలు కాంగ్రెస్ కు బూస్టింగ్ ఇచ్చాయి. గత రెండు ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా దక్కించుకోని హస్తం పార్టీ ఈ సారి దాదాపు 100 సీట్లతో బలమైన ప్రతిపక్షంగా అవతరించింది.  దీంతో ఆ పార్టీ శ్రేణులు తెగ ఖుషీ అవుతున్నారు. తమపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని 2029 నాటికి తమ బలం రెట్టింపు అవుతుందని ఆశ పడుతున్నారు.

సోనియాగాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టాక జరిగిన 1999 లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీకి 114 స్థానాలు వచ్చాయి. వరుసగా మూడు ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి పాలైంది. ఆ తర్వాత 2004 ఎన్నికల్లో 145 సీట్లు సాధించి యూపీఏ పేరిట సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి విజయవంతంగా నడిపారు.  ఆ తర్వాత 2009లో 206 సీట్లు దక్కాయి. ఈ నేపథ్యంలో తమ బలం పెరుగుతుందని భావించిన ఆ పార్టీ మిత్ర పక్షాలను బలహీన పరచడం మొదలు పెట్టింది.

2014 ఎన్నికల్లో ఒంటరిగా ఎన్నికలకు వెళ్లగా 44 సీట్లు మాత్రమే దక్కాయి. ఇక 2019లోను ఇదే విధానం అమలు చేయగా.. 52 స్థానాలు గెలుచోగలిగింది. తమ బలంపై ఒక అంచనాకు వచ్చిన తరుణంలో 2024లో మిత్ర పక్షాలతో ముందు సీట్లు పంచుకొని.. ఆ పార్టీ చరిత్రలో తొలిసారిగా అతి తక్కువ సీట్లలో పోటీకి పరిమితం అయింది. ఫలితాలు ఆశాజనకంగా వచ్చాయి. ఇప్పుడు ఇదే ఉత్సాహంతో 2029లో కూడా కూటమికి నాయకత్వం వహించి అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలనే ఆలోచనలో హస్తం నేతలు ఉన్నారు. మొత్తానికి అయితే ఈ లోక్ సభ ఫలితాలు వారిలో నూతన ఉత్సాహాన్ని నింపాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: