ఇందుకే చిత్తుగా ఓడాం.. వైసీపీ చెబుతున్న 10 కారణాలు ఇవే?

ఎందుకు ఓడాం. ఇదే వైసీపీని వేధిస్తున్న ప్రశ్న. కారణాలు అంతు చిక్కడం లేదు. విజయానికి ఎంతో మంది తండ్రులు ఉంటారు. కానీ ఓటమి అనాధ. అలా చూస్తే ఏ పార్టీ నేతలకు సరైన కారణాలు దొరకవు. అందుకే ఎంత మధనం చేసినా పోస్ట్ మార్టం చేసినా అవి ఓదార్పుకు మాత్రమే పనికొస్తాయి. అయితే పార్టీ ఓటమిపై పలువురు బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు.

ఇప్పటి వరకు  ఆపార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు విమర్శించగా.. తాజాగా ఆ పార్టీ వీర విధేయులు సైతం నిలదీస్తున్నారు. ఓటమికి పలు కారణాలను వారు ఎత్తి చూపుతున్నారు.  ఉచిత ఇసుకను రద్దు చేయడం వల్ల భవన నిర్మాణ కార్మికులు, పేద, మధ్య తరగతి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. మద్యం రేట్లు పెంచడంతో పాటు వారికి నచ్చిన బ్రాండ్లు అందుబాటులో ఉంచకపోవడంతో 90శాతం మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు.

సూపర్ సిక్స్ హామీలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి.  మా పెద్దలు సంపాదించిన లేదా మా డబ్బులతో కొన్న భూమిపై సీఎం ఫొటోను రైతన్నలు జీర్ణించుకోలేకపోయారు. డబ్బులు ఇస్తోంది తప్ప అభివృద్ధి చేయడం లేదనే భావన ప్రజల్లోకి బలంగా వెళ్లింది. గ్రామ, వార్డు సచివాలయాలను ఒకే సారి ఏర్పాటు చేయడం వల్ల సేవల సంతృప్తి తగ్గిపోయింది. ఉద్యోగ నోటిఫికేషన్లు వేయలేదని నిరుద్యోగుల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. వాలంటీర్ వ్యవస్థను నమ్ముకొని కార్యకర్తలను పట్టించుకోకపోవడంతో వారు అసంతృప్తికి లోనయ్యారు.

దీంతో పాటు స్థానిక నాయకుల ప్రభావం తగ్గిపోయింది. గుంతలు పడిన రోడ్లకు మరమ్మతులు కూడా చేయకపోవడం ఓటమికి ప్రధాన కారణం.  చెత్తపై పన్ను వేయడాన్ని కూడా ప్రజలు సహించలేకపోయారు. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు సరిగా ఇవ్వకపోవడంతో వారు శుభ్రతపై దృష్టి సారించలేదు. కేవలం ఐ ప్యాక్ ను నమ్ముకొని.. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలను అభిప్రాయాలను పక్కన పెట్టారు. సీఎం జగన్, సలహాదారులే రాష్ట్రాన్ని పాలిస్తున్నారని.. ఎమ్మెల్యేలు, మంత్రులు ఉత్సవ విగ్రహంలా మారారని అందరూ భావించారు. ప్రతిపక్ష నేతలపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేయడం, వ్యక్తిగత విమర్శలు చేయడం సామాన్య ప్రజలకు సైతం విసుగు తెప్పించింది. మూడు రాజధానులు అంశంతో ఏపీకి రాజధాని లేకుండా చేశారు. వీటితో పాటు పలు కారణాలు వైసీపీ ఓటమికి కీలకంగా పనిచేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: