ఇదేందయ్యా ఇదీ.. అప్పుడే మోదీ కూటమిలో కుంపట్లా?

ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర క్యాబినెట్ కూర్పుపై అసంతృప్తి సెగలు మొదలయ్యాయి. మంత్రి పదవులు కేటాయింపుపై శిందే వర్గం శివసేన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. తమ కంటే తక్కువ సీట్లు  గెలుచుకున్న ఇతర ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు క్యాబినెట్ హోదా కలిగిన మంత్రి పదవులు కేటాయించి.. మహారాష్ట్రలో ఏడు లోక్ సభ స్థానాలు గెలిచిన తమకు సహాయ మంత్రి పదవి ఇవ్వడంపై వారు పెదవి విరిచారు.

పదవులు కేటాయింపు విషయంలో బీజేపీ పక్షపాతం చూపిందని ఆ పార్టీ ఎంపీ బర్నే అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు ఈ ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు గెలిచిన అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కూడా మంత్రి పదవి కేటాయింపుపై వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఐదు సీట్లు గెలిచిన చిరాగ్ పాశ్వాన్ పార్టీకి, రెండు సీట్లు గెలుచుకున్న జేడీఎస్ నేత కుమార స్వామికి, ఒక్క సీటు మాత్రమే గెలిచిన జితిన్ రాం మాంఝీకి క్యాబినెట్ పదవులు ఇచ్చారని.. ఎన్డీయేలో జేడీయూ, టీడీపీ తర్వాత తామే అతిపెద్ద పార్టీ అయినా ఒక్క క్యాబినెట్ కూడా కల్పించకపోవడం దారుణమని శ్రీరంగ్ బర్నే అన్నారు.

బీజేపీ పాత మిత్రులుగా ఉన్న తమకు ఒక క్యాబినెట్, ఒక సహాయ మంత్రి వస్తుందని ఆశిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అయితే ఇందులో బీజేపీ పెద్దల ఆలోచన వేరేలా ఉందని తెలుస్తోంది. మరో మూడు నెలల్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో శిందే శివసేన, అజిత్ ఎన్సీపీలతో కలిసి వెళ్లే ఎన్నికల్లో నెగ్గుకురాలేమని తెలిసి.. వారిని పక్కన పెట్టింది అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

వాస్తవానికి శరత్ పవార్, ఉద్దవ్ థాక్రేలకు పార్టీ గుర్తులు లేకుండా చేసి.. వారిని బలహీన పరిచినా ప్రజలు వారి వెంటే ఉన్నారని ఈ లోక్ సభ ఫలితాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో వీరితో ఎన్నికలకు వెళ్తే తమకు నష్టం జరుగుతుంది అని బీజేపీ భావిస్తోంది. పైగా వీరు తిరిగి పాత గూటికే చేరతారు అనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో కావాలనే వీరిని పక్కన పెట్టారనే విశ్లేషణలు మొదలయ్యాయి. నిజమే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కాబట్టి ఎవర్నీ నమ్మలేం.

మరింత సమాచారం తెలుసుకోండి:

nda

సంబంధిత వార్తలు: