జగన్.. ఇలాగైతే క్యాడర్‌ బతికేది ఎలా?

టీడీపీ కూటమి భారీ విజయం సాధించడంతో రాష్ట్ర వ్యాప్తంగా మూడు పార్టీల్లో ఒక రకమైన జోష్ కనిపిస్తోంది. గత ఐదు ఏళ్లుగా వైసీపీ చర్యలతో విసిగి వేసారి పోయిన టీడీపీ శ్రేణులు ధైర్యంగా ముందుకు వస్తున్నారు. తమ పట్ల అమానుషంగా ప్రవర్తించిన వైసీపీ నాయకులపై దాడులకు వెనకాడటం లేదు. ముఖ్యంగా చంద్రబాబు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని, వల్లభనేని వంశీల ఇళ్ల పై టీడీపీ నాయకులు కోడిగుడ్లతో దాడి చేశారు.

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ, టీడీపీ నేతలు పరస్పరం దాడులు చేసుకుంటున్నారు.   శిలాఫలకాలు, నిర్మాణాలు, పేర్లను టీడీపీ నేతలు ధ్వంసం చేస్తున్నారు.  ఇళ్ల మీదకే వచ్చి దాడులు చేస్తున్నారు అని వైసీపీ తన మీడియాలో విజువల్స్, ఫొటోలతో సహా పేపర్ లో ప్రచురిస్తోంది. ఇంత జరుగుతున్నా.. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వీటిని ఎక్స్ వేదికగా ఖండిస్తున్నారు తప్ప బయటకు వచ్చి కార్యకర్తలను కలవడం లేదు.  2014 లో ఓటమి తర్వాత పాదయాత్ర చేసి జనాలను కలిసి వారి 2019లో అధికార పీఠమెక్కిన జగన్.. ఆ తర్వాత మళ్లీ ప్రజలను కలిసే ప్రయత్నం చేయలేదు. సామాన్యుల దగ్గరకు వెళ్లలేదు. ఎక్కడికి వెళ్లినా పరదాలు కట్టుకొని.. అక్కడ షాపులు, ఇతర వ్యాపార సంస్థలు బంద్ చేయించి పర్యటించేవారు.  దీంతో జనాల్లో ఒక రకమైన మార్పు కనిపించింది.

ఫలితం 2024 ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితం చేశారు. నాడు వైసీపీ హయాంలో దాడులు జరిగినప్పుడు టీడీపీ బాధితులకు అండగా నిలిచింది. లాయర్లను ఏర్పాటు చేసి పోలీస్ కేసులు పెట్టే వరకు వదిలి పెట్టలేదు.  ఆ తర్వాత బాధితుల ఇళ్లకు టీడీపీ నాయకులు, చంద్రబాబు, నారా లోకేశ్ లు ఇలా వరుసగా వెళ్లి పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. కానీ వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నా కనీసం జగన్ బయటకు రావడం లేదు. వారిని కలిసి పరామర్శించడం లేదు. వారికి అండగా కూడా ఉండటం లేదు. కార్యకర్తలు చనిపోతున్నా.. తీవ్ర గాయాలపాలవుతున్నా జగన్ స్పందిచడం లేదు. దీంతో కార్యకర్తల్లో ఒక రకమైన నైరాశ్యం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: