ఎన్డీయే కూలిపోతుందా.. వాళ్లు హ్యాండ్‌ ఇస్తారా?

ఎన్నికల్లో కనీస మెజార్టీ సాధించడంలో అధికార బీజేపీ విఫలం అయింది. దీంతో మిత్రపక్షాల మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ కూటమిలో చంద్రబాబు, నితీశ్ కుమార్ లు కీలకంగా మారారు. ఒకవేళ వీరిద్దరూ మద్దతు ఉపసంహరించుకుంటే బీజేపీ ప్రభుత్వం ప్రమాదంలో పడినట్లే.

ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని ప్రభుత్వాలు ఒక్క రోజే ఉంటాయి. అలాగే మోదీ సర్కారు కూడా పది హేను రోజులు మాత్రమే ఉంటుందని.. ఆ తర్వాత కూలిపోవచ్చు అని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం అప్రజస్వామికంగా, అక్రమంగా అధికారంలోకి వచ్చిందని వారికి శుభాకాంక్షలు తెలుమలేమని వ్యాఖ్యానించారు.  కేంద్రంలో ఇండియా కూటమి అతి త్వరలో అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే ఎప్పటికీ చేయలేమని అర్థం కాదు కదా అని ప్రశ్నించారు.

సొంతంగా మెజార్టీ సాధించలేకపోయినంత మాత్రాన ఇండియా కూటమి వెనక్కి వెళ్లిపోయిందని అనుకోవద్దు. పరిస్థితులు మారతాయాని ఎదురు చూస్తున్నాం. కొద్ది రోజులు ఆగండి. ఏమైనా జరగొచ్చు అంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడీ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. బెంగాల్ సీఎం మమత ఇలా ఎందుకు అన్నారనే చర్చ మొదలైంది.

ప్రధాని మోదీ తనకు బలం లేదని అక్కడే ఆగిపోరు. ఇండియా కూటమిలోని పార్టీలను తన వైపునకు తిప్పుకునేందుకు యత్నిస్తారు. ఆ క్రమంలో కూటమిలోని పార్టీలు జారిపోకుండా ధైర్యం చెప్పేందుకు ఆమె ఈ తరహా వ్యాఖ్యలు చేశారనేది విశ్లేషకుల వాదన. కూటమి పార్టీలకు ధైర్యం చెప్పి.. పరోక్షంగా మోదీకి హెచ్చరికలు పంపారని వారు అభిప్రాయపడుతున్నారు. పైగా పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎంపీలు తృణమూల్ వైపు చూస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. అయితే ఇప్పటికిప్పుడు మోదీ ప్రభుత్వానికి వచ్చే ముప్పేమీ లేదు. ఒకవేళ వివాదాస్పద చట్టాల విషయంలో మిత్ర పక్షాల అభిప్రాయం, సూచనలు పరిగణనలోకి తీసుకోకుంటే మాత్రం బీజేపీకి దెబ్బయ్యే ప్రమాదం ఉంది.  కానీ మోదీ, షాలు ఆ ఛాన్స్ తీసుకుంటారని ఎవరూ అనుకోవడం లేదు. కానీ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.  ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

nda

సంబంధిత వార్తలు: