పురంధేశ్వరికి ఛాన్సివ్వని మోదీ.. బాబు వ్యూహమేనా?

ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరికి ఈ సారి ప్రధాని మోదీ కాబినెట్ లో చోటు దక్కుతుందని అంతా భావించారు. ఆమె కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తాను గెలిస్తే కేంద్ర మంత్రి అవుతానని ప్రచారం చేసుకున్నారనే టాక్ కూడా ఉంది. పైగా గతంలో యూపీఏ హయాంలో మంత్రిగా చేసిన అనుభవం,  మహిళా కోటా, ఏపీ నుంచి ఆమెకు కచ్చితంగా మోదీ 3.0 మంత్రి వర్గంలో స్థానం లభిస్తుందని అనుకున్నారు.

అయితే వారందరి అంచనాలు తలకిందులు చేస్తూ.. నరసాపురం ఎంపీగా గెలిచిన శ్రీనివాస వర్మకు అనూహ్యంగా మంత్రి పదవి కట్టబెట్టింది బీజేపీ అధిష్ఠానం. సామాన్య కార్యకర్తకు మంత్రి పదవి లభించడం పట్ల ఆ పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నా.. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి కూటమి కట్టడంలో కీలకంగా వ్యవహరించి నోటా కంటే తక్కువ శాతం ఓట్లు వచ్చిన బీజేపీని మూడు ఎంపీ సీట్లు, ఆరు అసెంబ్లీ సీట్ల స్థాయికి తీసుకెళ్లిన ఆమెకు మొండి చెయ్యి చూపించడంతో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.

ఇక దీనిని అవకాశంగా మలచుకున్న వైసీపీ.. పురంధేశ్వరికి కేంద్ర మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నది చంద్రబాబే అని ప్రచారం చేయడం మొదలు పెట్టింది.  దీనిపై వాస్తవాలు మాట్లాడుకుంటే.. ఏపీలో ఎన్నికల ముందు పురంధేశ్వరి బీజేపీని చంద్రబాబు తాకట్టు పెట్టారని.. ఆ పార్టీని బావ జనతా పార్టీగా మార్చేశారని.. కూటమి కట్టడంలో ఆమె కీలకంగా పనిచేస్తున్నారని రకరకాల విమర్శలు గుప్పించారు.

ఇవన్నీ నిజమే అయితే కూటమి విజయం కోసం ఇంత కృషి చేసిన పురందేశ్వరికి మంత్రి పదవి రాకుండా చంద్రబాబు ఎందుకు అడ్డుపడతారు. అదే వాస్తవం అయితే తనకు అత్యంత సన్నిహితుడు సీఎం రమేశ్ కు అయినా మంత్రి పదవి ఇప్పించుకునేవారు కదా అని పలువురు పేర్కొంటున్నారు. ఒకవేళ ఏపీ నుంచి మంత్రి వర్గంలో ఎవరు ఉండాలో చంద్రబాబు నిర్ణయిస్తే శ్రీనివాస వర్మకు కాబినెట్ లో అవకాశం దక్కుతుందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి వైసీపీ చేస్తున్న ప్రచారంలో నిజం లేదని విశ్లేషకులు కొట్టి పారేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: