కౌం(హం)టింగ్: ఏకంగా సుప్రీంకోర్టులోనే కౌంటింగ్‌.. నెవ్వర్‌ బిఫోర్‌.. ఎవ్వర్‌ ఆఫ్టర్‌?

సుప్రీంకోర్టులో ఓట్ల లెక్కింపు
చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికలో విచిత్రం
దేశాన్ని ఆకర్షించిన ఘటన
కొన్ని ఘటనలు చరిత్రలో నిలిచిపోతాయి. ఇలాంటి సీన్‌ ఇంతకుముందు ఎప్పుడూ  చూడలేదబ్బా అనే రేంజ్‌లో ఉంటాయి. రేపు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ జరుగుతున్న నేపథ్యంలో ఇటీవల ఏకంగా సుప్రీంకోర్టులోనే ఎన్నికల కౌంటింగ్‌ జరిగిన ఘటనను ఓసారి గుర్తు చేసుకుందాం. అనేక కీలక అంశాలు, చట్టాలు, నిబంధనలకు సంబంధించి కీలక వాదనలకు నెలవైన ఈ దేశ అత్యున్నత న్యాయ స్థానం కూడా ఎన్నికల కౌంటింగ్‌కు వేదిక అయిన అరుదైన దృశ్యం ఇటీవల చండీగఢ్‌ మేయర్‌ ఎన్నిక సందర్భంగా జరిగింది.

అసలేం జరిగిందంటే.. చండీగఢ్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికలు జరిగాయి. అయితే.. మేయర్ ఎన్నిక కౌంటింగ్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. కార్పొరేటర్ల మద్దతు కాంగ్రెస్, ఆప్ కూటమికి ఉన్నా.. అక్కడ బీజేపీ అభ్యర్థి మేయర్‌గా గెలిచారు. దీంతో  రిటర్నింగ్ అధికారి అనిల్ మాసిహ్ తీరు పట్ల ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయన సరిగ్గా కార్పొరేటర్ల ఓట్లను లెక్కించలేదని.. కావాలని ఆప్‌ ఓట్లను చెల్లనివిగా ప్రకటించారని ఆప్‌ ఆరోపించింది.

దీనికి తోడు రిటర్నింగ్ అధికారి అనిల్ మాసిహ్ ఓట్ల లెక్కింపు సమయంలో సీసీ కెమేరా వైపు చూస్తూ ఎవరి ఆదేశాల ప్రకారమో పని చేస్తున్నట్టు కనిపిచింది. దీనిపై ఆప్‌ న్యాయం కోసం సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీంతో రిటర్నింగ్ అధికారి అనిల్ మాసిహ్ తీరు పట్ల సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనిల్ మాసిహ్ పక్కన పెట్టిన 8 బ్యాలెట్ పేపర్లను కూడా కలిపి లెక్కించాలన్న సుప్రీంకోర్టు.. ఆ కౌంటింగ్‌  తమ ముందే జరగాలని చెప్పింది.

సుప్రీంకోర్టులో జరిగిన కౌంటింగ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ- కాంగ్రెస్ కూటమి అభ్యర్థి అయిన కుల్దీప్ కుమార్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో ఆయననే చండీగఢ్ మేయర్‌గా సుప్రీంకోర్టు  జడ్జీలు ప్రకటించారు. ఈ ఘటనతో దశాబ్దాల సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారి ఎన్నికల కౌంటింగ్ కోర్టులో జరిగినట్టయింది.  అంతే కాదు.. ఎన్నికల ఫలితాలను రిటర్నింగ్‌ అధికారి కాకుండా సుప్రీంకోర్టు  న్యాయమూర్తులు ప్రకటించడం కూడా ఓ రికార్డే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: