ఉక్కిరిబిక్కిరి చేసిన వివాదం.. తెలివిగా తప్పించుకున్న రేవంత్‌ రెడ్డి?

తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నంలో మార్పులు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఈ చిహ్నంలోని చార్మినార్‌, కాకతీయ శిలా తోరణం స్థానంలో అమరవీరుల స్థూపం ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది. రాచరిక చిహ్నాలు కాకుండా ప్రజా ఉద్యమ చిహ్నాలు ఉండాలన్నది రేవంత్‌ సర్కారు అభిమతం. కానీ ఇది కాస్తా వివాదస్పదం కావడంతో రేవంత్ రెడ్డి తెలివి చూపారు. తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నం ఆవిష్కరణను వాయిదా వేశారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకల్లో అధికార చిహ్నాన్ని ఆవిష్కరించాలని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం భావించింది.

ప్రస్తుత లోగోలో రాచరిక గుర్తులు ఉన్నాయని.. ప్రజాస్వామ్యం, ఉద్యమాన్ని ప్రతిబింబించేలా మార్చాలని ఇటీవల తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కళాకారుడు రుద్ర రాజేశం 12 నమూనాలు రూపొందించారు కూడా . కొత్త చిహ్నంపై సీఎం రేవంత్ రెడ్డి కొన్ని రోజలుగా కసరత్తు చేస్తున్నారు. రుద్ర రాజేశంతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు, అధికారులతో చర్చించారు. కాకతీయ కళా తోరణం, చార్మినార్ తొలగించి.. ఆ స్థానంలో అమరవీరుల స్థూపం, బతుకమ్మ తో కొత్త చిహ్నం ఖరారు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందని మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది.

దీనిపై బీఆర్‌ఎస్‌ ఆందోళన చేపట్టింది. వివిధ వర్గాల నుంచి సుమారు 200కు పైగా సూచనలు కూడా వచ్చాయి. వీటన్నింటిపై పరిశీలించి ప్రజాస్వామ్యం, ఉద్యమం, పోరాటం, రాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక నేపథ్యంలో ప్రతిబింబించేలా కొత్త చిహ్నాన్ని తయారు చేసేందుకు మరింత సంప్రదింపులు చేయాలని రేవంత్‌ రెడ్డి సర్కారు నిర్ణయించింది. తెలంగాణ తల్లి రూపంపై కూడా చర్చలు జరపాలని రేవంత్‌ రెడ్డి భావిస్తున్నారు. దీనికి సమయం పడుతుంది కాబట్టి జూన్ 2న కాకుండా మరో సందర్భంలో అధికార చిహ్నం, తెలంగాణ తల్లి రూపం ఆవిష్కరించాలని రేవంత్‌ రెడ్డి నిర్ణయించారు.

రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను మాత్రం ముందుగా అనుకున్నట్టుగానే  జూన్ 2న రేవంత్‌ రెడ్డి ఆవిష్కరించనున్నారు. అందెశ్రీ రచించిన జయ జయహే తెలంగాణకు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వరకల్పన చేశారు. సుమారు 13 నిమిషాల పూర్తి గేయంతో పాటు... రెండున్నర నిమిషాల నిడివితోనూ రూపొందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: