రిషి సునాక్‌: మనోడు.. మనోడు.. అనుకుంటే మన పొట్టే కొడుతున్నాడుగా?

బ్రిటన్ లో వలసలు పెరుగుతున్నాయి. దీంతో స్థానిక యువతకు విద్య, ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయి. దీంతో వలసలను అడ్డుకోవాలని అక్కడి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. గతేడాది వలసలు రికార్డు స్థాయిలో 7,45,000 లకు చేరాయి. దీంతో స్థానికంగా వలసలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ ఊపందుకుంది. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ క్రమంలో వలసల కట్టడికి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కఠిన నిర్ణయం తీసుకోబోతున్నారు.

ఇందులో భాగంగా కొద్ది రోజుల క్రితం ఫ్యామిలీ వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో పాటు వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55 శాతం పెంచింది. ఇప్పుడు తాజాగా యూకే పోస్ట్ స్టడీ వీసాపై పరిమితులు విధించే దిశగా సునాక్ కసరత్తు చేస్తున్నారు. ఇది గ్రాడ్యుయేట్లు వారి డిగ్రీ కోర్సు పూర్తైన తర్వాత రెండేళ్ల వరకు కొనసాగడానికి, పనిచేయడానికి వీలు కల్పిస్తుంది.

పెరుగుతున్న చట్టపరమైన వలసలు అరికట్టడానికి కఠిన నిర్ణయం తీసుకునేందుకు సునాక్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే గ్రాడ్యుయేట్ స్కీం ను రద్దు చేసే విషయంలో కేబినేట్ నుంచే సునాక్ తిరుగుబాటును ఎదుర్కొంటున్నారు. 2021 లో ఈ స్కీం ప్రారంభం అయిన దగ్గర నుంచి భారతీయ విద్యార్థులే ఎక్కువగా దీనిని ఉపయోగించుకుంటున్నారు. కాగా .. భారతీయ గ్రాడ్యుయేట్ల ఆధిపత్యంలో ఉన్న పోస్ట్ స్టడీ వీసా మార్గం యూనివర్సిటీలకు దేశీయంగా ఆర్థిక నష్టాలను పూడ్చడంతో పాటు దేశ పరిశోధన రంగాన్ని విస్తరించడంలో సహాయపడుతోంది.

అయితే గ్యాడ్యుయేట్ రూట్ వీసా నిబంధనలు కఠినతరం చేయడం ద్వారా.. విదేశీ విద్యార్థుల్లో ప్రతిభావంతులైన వారిని మాత్రమే బ్రిటన్ లో ఉండనిచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ దిశగా సునాక్ కసరత్తులు చేస్తున్నారు. విదేశీ విద్యార్థులను తప్పు దోవ పట్టించే సమాచారాన్ని అందించే రిక్రూట్ మెంట్ ఏజెంట్లపై అణచివేత చర్యలు చేపట్టాలని తలచింది. ఇదిలా ఉండగా.. పోస్ట్ స్టడీ వీసాను 42 శాతం మంది భారతీయ విద్యార్థులు కలిగి ఉన్నారు.  ఈ విధానంతో వీరంతా నష్టపోయే ప్రమాదముంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: