టీడీపీ గ‌న్ని - ఘంటా ముర‌ళీ... నామినేటెడ్ పోటీ ..!

RAMAKRISHNA S.S.
- ఏలూరు జిల్లా పార్టీ అధ్య‌క్షుడిగా నాలుగేళ్లు గ‌న్ని అవిశ్రాంత పోరు
- జ‌న‌సేన కోసం త‌న ఉంగుటూరు సీటూ త్యాగం
- చింత‌ల‌పూడి గెలుపులో ముర‌ళీ ముద్ర‌
- డీసీసీబీ, జ‌డ్పీచైర్మ‌న్‌, ఎమ్మెల్సీ ప‌ద‌వుల‌పై ఆశ‌లు
( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )
ఏపీలో కూటమి ఘన విజయంతో సాధించి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవుల మీద బాబు దృష్టి పెట్టాల్సి ఉంది. ఈసారి పొత్తులో భాగంగా చాలామంది పార్టీ నేతలు సీట్లు త్యాగం చేశారు. కొందరు సీనియర్లు బాగా కష్టపడ్డారు. ఇప్పుడు వీళ్ళందరికీ ఎలాంటి పదవులు ఇస్తారు అన్నది ఆసక్తిగా మారింది. ఈ క్రమంలోనే ఏలూరు జిల్లా నుంచి పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్లు పోరాటం చేసి కష్టపడిన ఇద్దరు కీలక నేతల విషయంలో ఎవరికీ ఏ పద‌వి ? దక్కుతుంది అన్నది ఆసక్తిగా మారింది. ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే, ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణ ఇద్దరూ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్లపాటు గట్టిగా పోరాటం చేశారు. గన్ని అయితే ఉంగుటూరు తో పాటు ఏలూరు జిల్లా మొత్తం మీద గురిపెట్టి ఐదేళ్లు రాత్రనకా పగలనకా ఎంతో కష్టపడ్డారు. తన జిల్లా పరిధిలో ఏ చిన్న గొడవ తలెత్తకుండా పార్టీ క్యాడర్ మధ్య సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు నడిపించారు.

ఎన్నికలకు ముందు.. చివరకు తన ఉంగుటూరు సీటు సైతం గన్ని జనసేనకు త్యాగం చేయక తప్పని పరిస్థితి. నామినేటెడ్ పదవులు, పంపిణీలో.. ఏలూరు జిల్లా మొత్తం మీద గన్ని వీరాంజనేయులుకు ప్రథమ ప్రాధాన్యం దక్కనుంది. ఇటు ఐదేళ్లపాటు ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడుగా పార్టీని నడిపించి ఎన్నికల్లో క్లీన్ స్వీప్‌ అయ్యేలా చేశారు. దీంతో పాటు తన ఉంగుటూరు సీటు సైతం త్యాగం చేశారు. ఈ క్రమంలోనే గన్నికి ఏ పదవి వస్తుంది అన్నది ఆసక్తిగా ఉంది. జిల్లావ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ క్యాడర్ తో పాటు.. ఉంగుటూరు నియోజకవర్గ తెలుగుదేశం క్యాడర్ మొత్తం గన్నికి కచ్చితంగా కీలకమైన పదవి కావాలని పట్టుబడుతోంది. ఒకప్పుడు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కమ్మ పామాజిక‌ వర్గానికి రాజకీయంగా ప్రాధాన్యం ఉండేది. ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీలో కమ్మ సామాజిక వర్గానికి సాంప్రదాయ సీట్లుగా ఉన్న నిడదవోలు, ఉంగుటూరు అసెంబ్లీ సీట్లతో పాటు.. ఏలూరు ఎంపీ సీటు సైతం ఇతర సామాజిక వర్గాలకు వ‌దులు కోవాల్సిన‌ పరిస్థితి.

ఈ కోణంలోనూ గన్నికి కచ్చితంగా కీలక ప్రాధాన్యం, కీలక పదవి వస్తుందనే అందరూ భావిస్తున్నారు. ఇక చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణ పార్టీ ఓడిపోయే టైంలో పార్టీలోకి వచ్చి ఐదేళ్లపాటు ఎంతో కష్టపడ్డారు. చింతలపూడి నియోజకవర్గంలో ఐదేళ్లపాటు ప్రతి గ్రామం తిరుగుతూ పార్టీ కార్యక్రమాలను సీనియర్ నేతగా పర్యవేక్షిస్తూ ముందుకు నడిపించారు. చింతలపూడిలో పార్టీని నడిపించడంతో ఘంటా మురళీకి చంద్రబాబు నుంచి సైతం ఎన్నో సంద‌ర్భాల్లో ప్రత్యేక ప్ర‌సంస‌లు దక్కాయి. ఎన్నికలకు ముందు సైతం చంద్రబాబు చింతలపూడి సీటు విషయంలోనూ.. ఎన్నిక‌ల మేనేజ్‌మెంట్ విషయంలోను మురళీ కే ప్రాధాన్యత ఇచ్చారు. ఏదేమైనా చంద్రబాబు మురళీని గట్టిగా నమ్మారన్న‌ విషయంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. మరి అటు గన్ని ఆంజనేయులు, ఇటు ఘంటా మురళీకి.. చంద్రబాబు ఎలాంటి పదవులు ఇస్తారన్నది ప్రస్తుతానికి క్లారిటీ లేకపోయినా.. ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్, డిసిసిబి చైర్మన్ పదవుల్లో ఏదో ఒక పదవి ఈ ఇద్ద‌రు నేతలకు కచ్చితంగా వచ్చినా అవి ఏ ప‌దవులు అనేది వ‌చ్చే వ‌ర‌కు ఉత్కంఠే..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: