అసలు ఎక్కడ అవకాశం ఉందని కొరటాల దేవర పార్టు 2 ప్రకటించాడు?
అవును, ఇప్పుడు ఇదే విషయం చాలామంది సినిమా ప్రేక్షకుల మదిలో మెదులుతోంది. తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన దేవర సినిమా రిలీజ్ అయి, మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అభిమానులు సినిమా గురించి గొప్పగా పొగుడుతున్నప్పటికీ, కామన్ ఆడియన్ మాత్రం సినిమా పై పెదవి విరిచేస్తున్నాడు. అయితే దీనికి కారణం లేకపోలేదు.... ఇప్పుడు చాలామంది దర్శకులు రాజమౌళి మాయలో పడిపోయారు. బాహుబలి సినిమాతో రాజమౌళి రికార్డులు బద్దలు కొట్టిన సంగతి అందరికీ తెలిసిందే. కట్ చేస్తే తెలుగు సినిమా పరిశ్రమని రాజమౌళి తారాస్థాయిలో కూర్చోబెట్టాడు. అంతవరకు ఓకే గాని, అది కొంతమందికే చెల్లుతుంది. అందరికీ అది సాధ్యపడకపోవచ్చు!
కానీ కొంతమంది టాలీవుడ్ దర్శకులు తమ పంతాను మరిచిపోయి మరి, రాజమౌళి లాగా సినిమాలో తీయాలని ట్రై చేసి చేతులు కాల్చుకుంటున్నారు. ఇక కొరటాల దర్శకత్వ ప్రతిభ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మిర్చి, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలతో సూపర్ డూపర్ హిట్స్ అందుకున్న కొరటాల మెగాస్టార్ చిరంజీవితో చేసిన ఆచార్య సినిమాతో ప్లాఫ్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత అయినా కొరటాల తనదైన మార్కు చూపిస్తాడని అంతా ఎదురు చూశారు. మరి ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు కొరటాల పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ దేవర సినిమా డివైడ్ టాక్ రావడంతో అంతా కుమిలిపోతున్నారు.
అసలే బాగోలేని దేవర మొదటి పార్ట్ అభిమానుల సహనానికి పరీక్ష వంటిదైతే, ఏమాత్రము సెకండ్ పార్ట్ కి స్కోప్ లేని ఈ కథను సెకండ్ పార్ట్ అంటూ మరోసారి తీయడం అంటే? అది ప్రేక్షకులకు పెనుభారంగానే ఉంటుందని సగటు విశ్లేషకుడు అభిప్రాయపడుతున్నాడు. అయితే ఈ సినిమాలో బాహుబలి చాయలు కొట్టొచ్చినట్టు కనబడతాయని అంటున్నారు. అయితే బాహుబలి మాదిరి సినిమా మేకింగ్ లేకపోవడంతో, దేవర సెకండ్ పార్ట్ తీయడం అంటే? ఎన్టీఆర్ సమయం మరోసారి వృధా చేయడమే అని ఎన్టీఆర్ అభిమానులు కూడా బాహాటంగానే సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలు మీరు చూసినట్లయితే, దేవర సినిమా సెకండ్ పార్ట్ తీస్తే మంచిదా? తీయకపోతే మంచిదా? అసలు వర్కౌట్ అవుతుందా, లేదా అనే విషయాన్ని కింద కామెంట్ల రూపంలో తెలియజేయగలరు.