సైలంట్‌ టాక్‌: గెలుపుపై వైసీపీ, టీడీపీ, జనసేన సొంత లెక్కలు ఇవే?

గెలుపుపై పార్టీల్లో సైలంట్‌ టాక్‌
95 నుంచి 120 పక్కా అంటున్న టీడీపీ
సీట్లు తగ్గినా గెలుపు మాదే అంటున్న వైసీపీ
15 సీట్లలో విజయంపై జనసేన ధీమా
ఏపీలో సీఎం సీట్లో కూర్చొనేది ఎవరనే విషయం తేలాలంటే మరో రెండు వారాలు ఆగాల్సిందే. మరి అప్పటి వరకూ పార్టీలన్నీ తమ గెలుపు లెక్కలపై అంచనాలు వేసుకుంటున్నాయి. అధికార పార్టీ విషయానికి వస్తే.. మేం గత ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఎక్కువే గెలుస్తాం తప్ప.. తగ్గేదేలేదని సీఎం జగన్‌ ఐ ప్యాక్‌ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ధీమా వ్యక్తం చేశారు. ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఆయన హాయిగా ఫారిన్‌కు చెక్కేశారు. కుటుంబంతో ఆయన హాయిగా గడుపుతుంటే.. ఇక్కడి కేడర్, నేతలు మాత్రం నియోజకవర్గాల వారీగా ఎక్కడెక్కడ గెలుస్తాం.. ఎక్కడ టఫ్‌ ఉంది.. ఎక్కడ హోప్స్‌ లేవు అనే అంశాలు చర్చించుకుంటున్నారు.

వైసీపీ నేతలు జగన్‌ చెప్పిన రేంజ్‌లో కాకపోయినా అధికారం మాత్రం తమదే అన్న ధీమాలో ఉన్నారు. తక్కువలో తక్కువ 110 సీట్లకు తగ్గకుండా గెలుస్తామని ఆ పార్టీ నాయకులు తమ అంతర్గత సమావేశాల్లో చెప్పుకుంటున్నారు. ఓడిపోతామన్న చర్చ మాత్రం అసలు ఈ పార్టీలో కనిపించట్లేదు. అటు మరో ప్రధాన పార్టీ టీడీపీ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈసారి తాము తప్పకుండా గెలిచి తీరతామని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. కూటమికి కనీసం 95 నుంచి 120 మధ్యలో సీట్లు వస్తాయని అంతర్గతంగా అంచనా వేసుకుంటున్నారు.

ఒకవేళ కూటమికి వేవ్‌ ఉంటే మాత్రం ఈ లెక్క 140 నుంచి 150 దాటినా ఆశ్చర్యపోనవసరం లేదని చెప్పుకుంటున్నారు. పార్టీకి చెందిన ఏ ఇద్దరు మాట్లాడుకున్నా ఇదే టాక్‌ వినిపిస్తోంది. ఇక కూటమిలోని మరో కీలకపార్టీ జనసేన మాత్రం.. అందరి కంటే తమదే ఎక్కువ స్ట్రయికింగ్‌ రేట్‌ ఉంటుందని చెబుతోంది. కేవలం 21 అసెంబ్లీ సీట్లలోనే పోటీ చేసినా.. తాము వాటిలో తప్పుకండా కనీసం 11 గరిష్టంగా 16 వరకూ గెలుస్తామని చెబుతున్నారు. అంతే కాదు. పార్టీ పోటీ చేసిన రెండు ఎంపీ స్థానాల్లోనూ విజయఢంకా మోగిస్తామని ధీమాగా చెప్పుకుంటున్నారు.
 
మరో కూటమి పార్టీ బీజేపీ నేతలు కూడా తమకూ రాష్ట్రంలో మంచి రోజులు వచ్చాయని చెప్పుకుంటున్నారు. గత ఎన్నికల్లో కనీసం ఖాతా తెరవని తమ పార్టీ నుంచి ఈసారి గ్యారంటీగా ఐదారుగురు అసెంబ్లీకి.. నలుగురు పార్లమెంటుకు వెళ్లడం ఖాయం అని చెప్పుకుంటున్నారు. కూటమి వల్ల అత్యధికంగా లబ్ది పొందింది తామే అని మురిసిపోతున్నారు. మరి చూడాలి ఈ లెక్కలు ఎంత వరకూ వాస్తవ రూపం దాలుస్తాయో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: