వైసీపీ విక్టరీ: కూటమి ఓటమికి ఐదు కారణాలు ఇవే?

చివరినిమిషం వరకూ తేలని పొత్తులు
సజావుగా జరగని ఓటు బదిలీ
మేనిఫెస్టో లో విపరీతమైన హామీలు..
చంద్రబాబుపై అపనమ్మకం..
వాలంటీర్ల, ఉచితాలపై మారిన బాబు స్టాండ్
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పోలింగ్ సరళి కూటమి నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఓటర్లు భారీగా పోటెత్తడం, అర్ధరాత్రి దాటినా వెయ్యికి పైగా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ కొనసాగడం తమకు అనుకూలమో లేక ప్రతి కూలమో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. విజయం తమదేనని గంభీరంగా చెబుతున్నా.. మనసులో మాత్రం ఓటమి భయం వెంటాడుతోంది. వారి మాటల్లో కాస్త నైరాశ్యం కూడా కనిపిస్తోందని ప్రత్యర్థులు అంటున్నారు.

అయితే కూటమి ఓడితే మాత్రం ఓ ఐదు కారణాలను ప్రముఖంగా చెప్పవచ్చు. అందులో మొదటిది ప్రధానమైంది.. చివరి నిమిషం వరకూ పొత్తులు కుదరకపోవడం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని ఉద్దేశంతో టీడీపీ, జనసేనలు ముందుగానే పొత్తులు కుదుర్చుకున్నాయి. ఇంత వరకు బాగానే ఉన్నా మళ్లీ  ఈపొత్తులోకి బీజేపీ ని తీసుకురావాలని భావించి అభ్యర్థుల ఎంపిక, చర్చలు, మ్యానిఫెస్టో, ప్రచారం ఇలా అన్నీ వాయిదా పడ్డాయి. దీంతో ఇది కూటమి పై తీవ్ర ప్రభావం చూపింది. నోటిఫికేషన్ కు కొద్ది రోజుల ముందు మాత్రమే మూడు పార్టీల మధ్య పొత్తు కుదరడంతో 2014లా జనంలో కి వెళ్లలేకపోయింది.

రెండో కారణం.. ఓటు బదిలీ కాకపోవడం. సీట్ల సర్దుబాటు, రెబల్ నేతలు కూటమి నేతలకు తలనొప్పులుగా మారాయి. వీరిని సర్ది చెప్పడం ఒక ఎత్తు అయితే.. ఇంత తక్కువ సీట్లు అనే భావన ఆయా పార్టీ కార్యకర్తల్లో ఏర్పడింది.  ఎవరికీ వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరించడంతో ఓటు బదిలీ కూడా సక్రమంగా జరగలేదని తెలుస్తోంది.

మూడో కారణం టీడీపీ జనసేన మేనిఫెస్టో.. ఇందులో విపరీతమైన హామీలు ఇచ్చారు. ప్రజాకర్షక హామీలు ప్రకటించామని కూటమి నేతలు జబ్బలు చరుచుకుంటున్నా.. ఈ పథకాలకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారో మాత్రం  స్పష్టత ఇవ్వలేదు. ఉచితాలు అందిస్తే గతంలో శ్రీలంక అవుతుందని విమర్శించిన చంద్రబాబే.. ఇప్పుడు వైసీపీని మించి సంక్షేమ పథకాలు ప్రకటించడం గమనార్హం.

నాలుగో కారణం చంద్రబాబుపై అపనమ్మకం.. వాలంటీర్ల వ్యవహారంలో స్టాండ్ మార్చడం, తాము అధికారంలోకి వస్తే రూ.10 వేలు ఇస్తామని చెప్పడం.. ఇలా పలు రకాల యూ టర్న్ లను చూసి ప్రజలు అంతగా చంద్రబాబు వైపు మొగ్గు చూపలేదని అర్థం అవుతుంది.
ఐదో కారణం విశ్వసనీయత నిలుపుకున్న జగన్.. మ్యానిఫెస్టోలో 90శాతం హామీల అమలు వంటి అంశాలను సీఎం జగన్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. అందుకే కొత్త హామీలు ఇవ్వకపోయినా.. ఐదేళ్ల పాలన ఇచ్చిన భరోసాతో జనం జగన్‌నే నమ్మారు.. చంద్రబాబుని ఏపీ ప్రజలు అంతగా విశ్వసించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp

సంబంధిత వార్తలు: