జగన్‌ కాదు.. చంద్రబాబు కాదు.. మోదీ కాదు.. రాహుల్‌గాంధీ కాదు.. గెలిచేది డబ్బే!?

రూ. కోట్లు ఉంటేనే టికెట్లు ఇస్తున్న పార్టీలు..
రాజకీయాల్లోకి రావాలంటే కోట్లు ఉండాల్సిందే..
వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లే ఇప్పుడు నేతలు..
ప్రజలకు ఓటుకు నోటు అలవాటు చేసిన పార్టీలు
ఎన్నికల్లో  గెలవాలంటే.. ఏం కావాలి.. ఏ పార్టీ అయినా ఎన్నికల్లో ఎలా గెలుస్తుంది.. అధికారం చేజిక్కించుకుకోవాలంటే పార్టీలకు ఎవరి అండ కావాలి. ఈ ప్రశ్నలకు సమాధానంగా ఒకప్పుడు ప్రజాభిమానం, ప్రజాసేవ చేసే పార్టీ.. ప్రజాభిమానం దక్కించుకోవడం అనే సమాధానాలు వచ్చేవి.. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఈ ప్రశ్నలన్నింటికీ వచ్చే సమాధానం ఒక్క డబ్బు మాత్రమే అనేలా తయారయ్యింది. ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిపోయింది.

ఇప్పుడు జరుగుతున్న 18వ లోక్‌సభకు 2024 సాధారణ ఎన్నికలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలని ఇటీవల  సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అనే సంస్థ అంచనా వేసింది. ఈ సారి ఇండియా మొత్తం ఎన్నికల అంచనా వ్యయం రూ. 1.35 లక్షల కోట్లకు చేరుతుందని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ సంస్థ అంచనా వేసింది. ఈ సంస్థ 35 ఏళ్లుగా ఎన్నికల వ్యయాన్ని పరిశీలిస్తోంది. ఈ సంస్థ లెక్కల ప్రకారం 2019లో ఖర్చుతో పోలిస్తే తాజా ఖర్చు రెండింతలు ఎక్కువగా తేలింది.

అసలు ఎన్నికలు అంటేనే డబ్బుతో ముడిపడిన అంశం. అయితే.. ఇదేమీ కొత్త కాదు.. ఇదేమీ రాజ్యాంగ విరుద్దమూ కాదు. ఎన్నికల్లో పోటీ చేయాలన్నా.. ఎన్నికల్లో ప్రచారం నిర్వహించాలన్నా.. గెలుపు వ్యూహాలు రచించాలన్నా డబ్బు అవసరమే. ఎన్నికల కోసం డబ్బు ఖర్చు చేయడం కొత్తగా వస్తున్న అంశమేమీ కాదు. కానీ.. ఇటీవలి కాలంలో ఎన్నికల్లో డబ్బు ప్రభావం విపరీతంగా పెరిగిపోయింది. స్వాతంత్ర్యం వచ్చిన మొదట్లో కేవలం ప్రజాసేవ చేసే ఆలోచన ఉన్న నాయకులే ఎన్నికల్లో పోటీ చేసేవారు. అలాంటి వారు విరాళాల ద్వారా డబ్బు పోగేసుకుని ఎన్నికల్లో పోటీ చేసేవారు.

ఆ తర్వాత సీన్ మారిపోయింది. అసలు మనం డబ్బు పెట్టడం ఏంటి.. మరొకరు నెగ్గడం ఏంటని.. ఏకంగా ధనవంతులే రాజకీయాల్లోకి రావడం ప్రారంభించారు. అలా కోట్లు ఖర్చు చేయగల వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలు, కాంట్రాక్టర్లు వంటి వారు కూడా రాజకీయాల్లోకి రావడం ప్రారంభించారు. మొదట్లో ఇలాంటి వారి నిష్పత్తి తక్కువగా ఉన్నా.. క్రమంగా అది పెరుగుతూ వస్తోంది. తొలి రోజుల్లో ఎన్నికల్లో గెలవాలంటే.. మంచి నాయకత్వం.. మంచి పథకాలు.. అవసరం అయ్యేవి.

ఆ తర్వాత కాలంలో మంచి నాయకత్వం, మంచి పథకాలు కాదు. బాగా డబ్బున్న వాళ్లు పార్టీకి అండగా ఉండటం ప్రధానంగా మారింది. ధనవంతులు క్రమంగా రాజకీయ నేతలుగా రూపాంతరం చెందారు. సాధారణంగా ప్రజాసేవ చేయాలనుకున్న నాయకులు, జనం నుంచి ఎదిగిన నాయకుల కన్నా .. ఇలా నేరుగా రాజకీయాల్లోకి వచ్చిన ధనవంతులకు క్రమంగా పార్టీల్లో పలుకుబడి కూడా పెరిగింది. 1990ల తర్వాత ఈ జాడ్యం క్రమంగా జడలు విప్పుకుందని చెప్పొచ్చు.

మొదట్లో పార్టీలు నాయకుల ఎన్నికల ఖర్చుల కోసం ఫండ్ ఇస్తుండేవి. ఆ తర్వాత పార్టీలు కూడా ఖర్చులు భరించలేక.. ఎన్నికల ఖర్చు పెట్టుకోగల నాయకులను గుర్తించి వారికి పెద్ద పీట వేయడం ప్రారంభించాయి. ఈ జాడ్యం చంద్రబాబునాయుడు సీఎం అయ్యాక మరింతగా పెరిగింది. ఎన్నికలు నెగ్గడాన్ని ఓ మనీ గేమ్‌గా మార్చేసిన వారిలో చంద్రబాబు ఒకరుగా చెప్పుకోవచ్చు. తెలుగు నాట పారిశ్రామిక వేత్తలకే ఏకంగా టికెట్లు ఇవ్వడం.. పార్టీలో ప్రధాన పాత్ర ఇవ్వడం వంటి అంశాలకు కూడా చంద్రబాబే ఆద్యుడిగా చెప్పుకోవచ్చు. నామా నాగేశ్వరరావు, సుజనా చౌదరి, సీఎం రమేశ్‌, నారాయణ వంటి కుబేరులకు పార్టీలో పదవులిచ్చి.. వారి ధన బలంతో రాజకీయాలు సాగించారు చంద్రబాబు.

అప్పటి నుంచి ఎన్నికల గేమ్‌ పూర్తిగా మారిపోయింది. నాయకుడికి టికెట్‌ ఇవ్వాలంటే ప్రజల్లో అతనికి ఉన్న ఆదరణ కంటే.. అతడి ధన సామర్థ్యమే గీటురాయిగా మారిపోయింది. తన ఎన్నికల ఖర్చుతో పాటు మరో ఇద్దరు, ముగ్గురు నేతల ఖర్చు పెట్టుకోగల నేతలకు డిమాండ్ పెరిగిపోయింది. ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులు పంచడం ఎప్పటి నుంచో ఉన్నా.. అలా ఓటు గిరాకీని అమాంతం పెంచింది కూడా చంద్రబాబు హయాం నుంచే అని చెప్పుకోవచ్చు.

ఏటేటా ఈ ఓట్లు రేట్లు పెరిగిపోతున్నాయి. 1995 నుంచి 2004 మధ్యలో ఓటు రేటు వందల్లో ఉంటే.. ఆ తర్వాత అది కాస్తా వేలల్లోకి మారిపోయింది. ఇటీవల మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఏకంగా ఓటుకు పదివేల రూపాయల వరకూ పంచారన్న ప్రచారం జరిగింది. ప్రభుత్వాల నుంచి వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు దక్కించుకునే కాంట్రాక్టర్లు.. క్రమంగా కోట్లకు కోట్లు పార్టీలకు ఫండ్‌ అందిస్తున్నారు. 2004 నుంచి 2014 వరకూ క్రమంగా సాగునీటి ప్రాజెక్టుల ద్వారా వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు వస్తున్నాయి. అధికారంలో ఉన్న పార్టీలు ఇలాంటి వాటిని ఏటీఎంలుగా మలచుకుంటున్నాయి.

ఈ కాలంలో ఎమ్మెల్యేగా నెగ్గాలంటే కనీసం 50 కోట్లు.. ఎంపీగా నెగ్గాలంటే కనీసం 100 కోట్లు ఖర్చు చేయాల్సిన దుస్థితి తలెత్తింది. పార్టీ టికెట్‌ సంపాదించుకోవడానికి కోట్లు.. టికెట్‌ వచ్చాక ప్రచారానికి కోట్లు.. అనుచరులను మేపేందుకు కోట్లు.. ప్రజల ఓట్లు కొనేందుకు కోట్లు.. ఇలా కోట్లు ఖర్చు చేయందే ఎన్నికలు జరిగే పరిస్థితి ఇవాళ లేదు. పార్టీలు చేసిన అలవాటుతో జనం కూడా ఎన్నికలు రాగానే  ఎవరు డబ్బులు ఇస్తారా అని ఎదురు చూడటం ప్రారంభించారు. చివరకు తమ ఊళ్లో డబ్బు పంచలేదన్న కారణంగా ధర్నాలు చేసిన వార్తలు కూడా వచ్చాయి. ఈ ధన రాజకీయాల పుణ్యమా అని సామాన్యులు, సామాన్య నేతలు క్రమంగా రాజకీయాలకు దూరమైపోయారు. కేవలం కోట్లు ఖర్చు చేయగల నాయకులే బరిలో మిగులుతున్నారు. జనం కూడా పంచుతున్నది తమ సొమ్మే అన్న ధీమాతో  ఎవరు ఎంత ఇచ్చినా తీసుకుంటున్నారు. ఇప్పుడు మన ప్రజాస్వామ్యంలో ధనస్వామ్యం అంతర్భాగంగా మారిపోయింది. విడదీయలేని ఓ అంశంగా మారిపోయింది. మరి ఈ ధనరాజకీయాలకు అంతం ఉందా అంటే ఇప్పట్లో లేదనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: