ఇదీ నిజం: సమస్యలు పట్టని నేతలు.. ప్రజలకు పట్టని ఎన్నికలు..?

దేశంలో సార్వత్రిక ఎన్నికల పండుగ జరుగుతోంది. మొత్తం ఏడు విడతల్లో పోలింగ్‌ జరగనుండగా ఇప్పటికే రెండు విడతల పోలింగ్ పూర్తయింది. ఈనెల 7న మూడో విడత పోలింగ్‌.. ఈనెల 13న నాలుగో విడత పోలింగ్‌ జరగనుంది. అయితే మొదటి రెండు విడతల పోలింగ్‌ తీరును పరిశీలిస్తే.. పోలింగ్ శాతం తగ్గడం విశ్లేషకులను కలవరపరుస్తోంది. పోలింగ్ శాతం ఎందుకు తగ్గుతోంది. ప్రజలు ఎందుకు పోలింగ్‌కు దూరమవుతున్నారు. ఈ కారణాలు అన్వేషిద్దాం.

పోలింగ్ శాతం తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో మండుతున్న ఎండలు, మరోవైపు  పంట కోతల కాలం, దీనికి తోడు సుదీర్ఘ వారాంతపు సెలవులు కూడా పోలింగ్ శాతం తగ్గడానికి కారణాలుగా కనిపించవచ్చు. కానీ.. అసలైన కారణం మరొకటి ఉంది. అదే అత్యంత కీలకమైంది. అదేంటంటే.. క్రమంగా ఎన్నికల పట్ల ప్రజల్లో పెరుగుతున్న అనాశక్తి.. మరి ఎందుకు ఈ అనాశక్తి పెరుగుతోంది. ప్రజల్లో ఎన్నికలంటే ఎందుకు ఆసక్తి చూపట్లేదు.

ఇందుకు కారణాలు అన్వేషిస్తే.. మన దేశ రాజకీయ వ్యవస్థే అందుకు కారణంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు దేశంలో ప్రధానంగా రెండు కూటములు ఉన్నాయి. ఒకటి ఎన్డీఏ, రెండోది ఇండియా కూటమి. ఈ రెండు కూటములు ఎన్నికల్లో విభిన్న అంశాలకు ప్రాధాన్యమిస్తున్నాయి. బీజేపీ ప్రధానంగా మత అంశాలను రెచ్చగొడుతూ ముందుకు వెళ్తోంది. చివరకు మోడీ కూడా కాంగ్రెస్ నేతలు హిందువుల ఆస్తులను దోచి ముస్లింలకు పంచి పెడతారనే స్థాయి చౌకబారు విమర్శలకు దిగుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా తక్కువ తినడం లేదు. బీజేపీ వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారని, రాజ్యాంగాన్ని మార్చేస్తారని భయపెడుతున్నాయి.

అయితే ఈ రెండు కూటములు ప్రజా సమస్యలను పెద్దగా పట్టించుకోవట్లేదు. జనం కూడా ఎవరు అధికారంలోకి వచ్చినా తమ బతుకుల్లో పెద్దగా మార్పులు వచ్చేదేమీ లేదన్న నిర్ణయానికి వస్తున్నారు. కొన్నాళ్ల క్రితం కోవిడ్ వల్ల, సుదీర్ఘ లాక్‌డౌన్‌ల వల్ల జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొన్నేళ్లుగా ధరలు మండిపోతున్నాయి. ఉద్యోగాలు పోతున్నాయి. కొత్త ఉద్యోగాలు రావట్లేదు. ప్రజల ఆదాయాలు పడిపోతున్నాయి. ఇలా జనం తమ సమస్యల్లో తాము మునిగి ఉన్న నేపథ్యలో.. ఇక బారులు తీరి ఓటేసేందుకు వారు ఆసక్తి చూపిస్తారా అన్న విషయం ఆలోచించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: