తెలుగు రాష్ట్రాల్లో మహిళా మంత్రులు.. రబ్బర్‌ స్టాంపులేనా?

జనాభాలో సగాన్ని దాటుతున్న మహిళలు.. అధికారాన్ని మాత్రం సమంగా పంచుకోలేకపోతున్నారు. రాజకీయ ప్రాతినిధ్యం విషయంలో ఇంకా వెనుకబడే ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అంశంలోనూ.. గెలిచాక మంత్రి పదవులు దక్కే విషయంలోనూ మహిళలు ఇంకా వెనుకబడే ఉంటున్నారు. ఇప్పుడిప్పుడే మహిళల ప్రాతినిధ్యం పెరుగుతున్నా.. అది ఆశించిన స్థాయిలో లేదు. గత పదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో మహిళల ప్రాతినిధ్యం.. మంత్రులుగా మహిళల పనితీరు ఓసారి పరిశీలిద్దాం.

2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. తమ మంత్రివర్గంలో కిమిడి మృణాళిని, పరిటాల సునీత, పీతల సుజాత వంటి వారికి అవకాశం కల్పించారు. ఆ తర్వాత వైసీపీ నుంచి వచ్చిన  భూమా అఖిలప్రియకు కూడా మంత్రి పదవి ఇచ్చారు. అయితే వీరిలో ఎవరూ తమదైన ముద్ర వేయలేకపోయారనే చెప్పాలి. బహుశా అందుకే కావచ్చు. 2019లో తెలుగు దేశం ఓడిపోయిన తర్వాత చంద్రబాబు మంత్రి వర్గంలో మహిళలుగా పని చేసిన వారిలో ఎవరూ  పెద్దగా క్రియాశీలంగా లేకపోవడం విశేషం.

ఇక జగన్ విషయానికి వస్తే.. ఆయన తన తొలి మంత్రి వర్గంలో పాముల పుష్ప శ్రీవాణి, తానేటి వనిత, మేకతోటి సుచరితలకు మంత్రులు అవకాశం కల్పించారు. ఇందులో పాముల పుష్పశ్రీవాణికి ఏకంగా ఉప ముఖ్యమంత్రి హోదా కూడా  ఇచ్చారు. ఇక మేకతోటి సుచరితకు ఏకంగా హోంమంత్రిత్వ శాఖనే కట్టబెట్టారు.  రెండున్నరేళ్ల తర్వాత మంత్రి వర్గాన్ని మార్చిన జగన్‌..  తానేటి వనిత, మేకతోటి సుచరితలను శాఖలు మార్చి కొనసాగించారు. కొత్తగా రోజా, విడదల రజిని, ఉషాశ్రీ చరణ్‌ లకు అవకాశం కల్పించారు. ఈసారి హోంశాఖను తానేటి వనితకు అప్పగించారు.

జగన్‌ మంత్రివర్గంలోనూ మహిళల  పాత్ర అంతంతమాత్రమే. పేరుకు మహిళా హోంమంత్రులు ఉన్నా వారి పాత్ర నామమాత్రంగానే ఉంది. ఇక రోజా కాస్త యాక్టివ్‌గా కనిపించినా అది అంత ప్రాధాన్యత లేని క్రీడలు, టూరిజం శాఖ కావడం విశేషం. ఇక ఇప్పటికే రెండు సార్లు గెలిచిన రోజా.. ఈసారి మాత్రం ఎదురీదుతున్నారు. సొంత పార్టీలో వ్యతిరేకతకు తోడు.. గాలి కుటుంబంపై ఉన్న సానుభూతి ఆమెకు ప్రతికూలతలకుగా మారాయి.  జగన్ మంత్రి వర్గంలో విడదల రజని, రోజా వంటి వారు తప్ప ఇతరులు పెద్దగా తమ ముద్ర వేయలేకపోయారు.

ఇక తెలంగాణ విషయానికి వస్తే.. కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు కనీసం ఒక్క మహిళకు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించలేదన్న నింద చాలా కాలం మోశారు. ఆ తర్వాత సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాధోడ్‌ వంటి వారికి అవకాశం కల్పించారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి మంత్రి వర్గంలో సీతక్క, కొండా సురేఖ మంత్రులుగా ఉన్నారు. వీరిద్దరూ స్వతంత్రించి నిర్ణయాలు తీసుకోగలిగిన నేతలే.

మొత్తం మీద ఓవరాల్‌గా చూసుకుంటే.. తెలుగు రాష్ట్రాల్లో మహిళలు మంత్రులుగా అధికారంలో ఉంటున్నా స్వతంత్రించి నిర్ణయాలు తీసుకోవడంలోనూ.. తమదైన శైలి చూపించడంలోనూ ఇంకా వెనుకబడే ఉంటున్నారు. ఇటీవల మోదీ సర్కారు చట్ట సభల్లో మహిళల రిజర్వేషన్ల బిల్లును ఆమోదించింది. ఇకపై మహిళలకు చట్టసభల్లో తప్పనిసరిగా 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంటుంది. 2029 నుంచి అమల్లోకి రానున్న ఈ చట్టం ద్వారానైనా మహిళాసాధికారిత పెరుగుతుందని ఇండియా హెరాల్డ్ ఆశిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: