పవన్‌కు అనుకూలంగా ఈసీ నిర్ణయం.. బతికిపోయాడుగా?

గాజుగ్లాసు గుర్తు కేటాయింపుపై పవన్‌ కల్యాణ్‌కు కొంతమేర ఊరట లభించింది. ఆ పార్టీ పోటీ చేస్తున్న మచిలీపట్నం, కాకినాడ పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో గ్లాసు గుర్తును ఫ్రీజ్ చేస్తున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ గుర్తును ఇతరులకు కేటాయించబోమని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. జనసేన పోటీ చేసే 21 శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని 13 ఎంపీ స్థానాల్లో పోటీచేసే స్వతంత్రులకూ గ్లాసు గుర్తు కేటాయించబోమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

జనసేన పార్టీకి గాజుగ్లాసు గుర్తు రిజర్వు చేసే అంశంపై హైకోర్టుకు ఎన్నికల సంఘం నివేదిక సమర్పించింది. జనసేన పార్టీ పోటీ చేసే ఎంపీ స్థానాల పరిధిలో అసెంబ్లీ సీట్లలో గాజుగ్లాసు గుర్తును ఇతరులకు కేటాయించబోమని అలాగే ఆ పార్టీ పోటీ చేసే అసెంబ్లీ స్థానాల పరిధిలోని  ఎంపీ స్థానాల్లోనూ అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తును కేటాయింపు ఉండదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇతర అసెంబ్లీ స్థానాల్లో మాత్రం గ్లాసు గుర్తు ఫ్రీ సింబల్‌గా  ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొంది.

రాష్ట్రంలో 63 చోట్ల ఇప్పటికే గాజు గ్లాసు గుర్తును కేటాయించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు మార్పు చేర్పులు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. మార్పు చేర్పులు చేసి పోటీ చేస్తున్న అభ్యర్ధులకు ప్రత్యామ్నాయ ఎన్నికల చిహ్నాలను కేటాయించాలని ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. ఎన్నికల గుర్తుల నియమావళి 1968 లోని 10బి నిబంధన ప్రకారం జనసేన పార్టీకి కేటాయించిన గాజు గ్లాసుని 175 నియోజకవర్గాల్లోనూ కామన్ సింబల్‌గా కేటాయించామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

ఏపీలో జరగనున్న లోక్‌సభ, శాసనసభ ఎన్నికలకు సంబంధించి ముందుగా గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ గా ఇచ్చారు. అయితే ఆ జాబితా నుంచి తొలగించాలని.. ఇతరులకు కేటాయించొద్దని జనసేన పార్టీ నుంచి అందిన వేర్వేరు అభ్యర్థనల మేరకు ఆ గుర్తును 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ కామన్ సింబల్ గా గుర్తించామని ఎన్నికల సంఘం తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: