సునీత: వైఎస్‌అవినాష్‌.. నిను వీడని నీడను నేనే?

ఓ పాత సినిమాలో నిను వీడని నీడను నేనే.. కలలా మెదిలే కథ నేనే.. అనే ఓ హారర్‌ బ్యాక్‌డ్రాప్‌ సాంగ్‌ ఉంటుంది. ఓ హంతకుడి చేతిలో హతురాలైన మహిళ ఆత్మ.. ఆ హంతకుడిని వేటాడే సమయంలో వచ్చే సాంగ్‌ అది. అలాగే ఆ మధ్య వచ్చిన అరుంధతి సినిమాలోనూ ఇలాంటి డైలాగ్‌ ఒకటి ఉంటుంది. వదల బొమ్మాళీ వదల.. అంటూ పశుపతి అరుంధతిని ఉద్దేశించి అంటుంటాడు. ఇప్పుడు ఏపీలో మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీత తీరు చూస్తే ఈ రెండు సినిమా సీన్లు గుర్తు వస్తున్నాయి.

నర్రెడ్డి సునీత కూడా వివేకా హత్య కేసులో నిందితుడైన తనకు అన్న వరుసైన వైఎస్‌ అవినాష్‌ రెడ్డిని వదిలేది లేదంటున్నారు. వివేకా హత్య వైఎస్‌ అవినాష్‌ రెడ్డే చేయించాడని సునీత బలంగా నమ్ముతున్నారు. తన తండ్రి హంతకులకు శిక్ష పడేలా చేయాలని ఓ కుమార్తెగా ఆమె ఎంతగానో పోరాడుతున్నారు. అయితే ఈ పోరాటం దాదాపు మూడేళ్ల క్రితమే మొదలైంది. కానీ అప్పుడు అది ఒంటరిపోరాటం. ఇప్పుడు ఎన్నికల సమయం కనుక.. అదే నిందితుడైన అవినాష్‌ రెడ్డి మళ్లీ కడప నుంచి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నాడు కనుక.. సునీత తన న్యాయ పోరాటాన్ని రాజకీయ పోరాటంగా  మార్చుకున్నారు.

వైఎస్‌ అవినాష్‌ రెడ్డికి వ్యతిరేకంగా ఆమె కడప పార్లమెంటు ప్రజలను ప్రచారం చేస్తున్నారు. ఓ హంతకుడిని ఎలా గెలిపిస్తారని ఆమె ప్రజలను అడుగుతున్నారు. అవినాష్‌ రెడ్డిని ఓడించేందుకు తాను ఎవరితోనైనా చేతులు కలుపుతానని స్పష్టంగానే చెప్పేశారు. ఏదో ఓ ప్రెస్ మీట్‌ పెట్టేసి.. ఆ తర్వాత ఫలితం ఆ దేవుడు చూసుకుంటాడని వదిలేసే రకం కాదు సునీత. ఇక ఈ పోరాటాన్ని షర్మిల కూడా తనకు అనుకూలంగా మలచుకున్నారు. అవినాష్‌ రెడ్డికి వ్యతిరేకంగా అదే కడప నుంచి తాను ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగారు.

అవినాష్‌ రెడ్డి వంటి హంతకులను ఓడిస్తే.. ఆ తర్వాత ఆయనకు రాజకీయంగా అండదండలు తగ్గుతాయని.. కేసు దర్యాప్తును ప్రభావితం చేయలేరని సునీత భావిస్తున్నారు. అందుకే కడపలో షర్మిలతో కలసి ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో పదే పదే సుదీర్ఘమైన ప్రెస్‌ మీట్లు పెట్టి.. వివేకా హత్య కేసులో అవినాష్‌ రెడ్డి పాత్రను ఆధారాలతో వివరిస్తున్నారు. మరి ఈ వాదనను కడప ప్రజలు ఎంత వరకూ నమ్ముతారు.. ఎవరిని గెలిపిస్తారన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: