రాళ్ల రాజకీయం: చంద్రబాబు ఓకే.. నేతలే కొంపముంచేశారా?

ఏపీ సీఎం జగన్ పై రాయి దాడి సంచలనంగా మారింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడలో బస్సు యాత్ర చేపడుతున్న జగన్ పై గులకరాయితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు ముఖంపై చిన్నపాటి గాయం అయింది. ఎన్నికల ముంగిట దాడి జరగడంతో నేతలు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ.. మాజీ సీఎం చంద్రబాబు, ఇతర సీఎంలు స్పందించారు.

అయితే ఈ దాడి విషయంలో తెలుగు దేశం నేతలు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. ఒక రాష్ట్ర సీఎంపై దాడి జరిగిన సమయంలో దానిని ఖండించాల్సింది పోయి.. కోడి కత్తి డ్రామా 2.0, ఎన్నికల వేళ మరో జిమ్మిక్కు వంటి అంశాలను ప్రస్తావిస్తూ దీనిని అపహాస్యం చేస్తున్నారు. రాజకీయాలు అన్నప్పుడు విమర్శలు, ప్రతి విమర్శలు తప్పనిసరి. అయితే ప్రత్యర్థి కష్టకాలంలో ఉన్న సమయంలో ఓదార్చాల్సింది పోయి.. రాజకీయాలే ముఖ్యమా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఆయనపై తిరుపతిలో దాడి జరిగితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి వెళ్లి పరామర్శించి.. సంఘీభావంగా నిరసన దీక్ష చేపట్టారు. కానీ నేడు టీడీపీ వ్యవహరిస్తున్న తీరు అత్యంత జగుప్సాకరంగా ఉందని పలువురు విమర్శిస్తున్నారు. దాడి జరిగిన వెంటనే టీడీపీ నేతలు మీడియా ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. వీరిని నిలువరించే ప్రయత్నం కూడా చంద్రబాబు చేయలేదు.

మరోవైపు నారా లోకేశ్ ఒక సెటైరికల్ గా, పద్యరూపంలో జగన్ ని విమర్శిస్తూ పోస్టు
 చేశారు. ఇదే సమయంలో చంద్రబాబు ప్రధాని మోదీ ఈ దాడిని ఖండించిన తర్వాత తాను కూడా జగన్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. దీనిపై విచారణ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. చంద్రబాబు మద్దతుగా.. నారా లోకేశ్, టీడీపీ విరుద్ధంగా స్పందించడం వెనుక వీరు మొత్తం ఒకటి కాదా.. వేర్వేరా అనే ప్రశ్నలు మొదలవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: