ఫ్యామిలీ పాలిటిక్స్‌: జగన్‌, షర్మిల, అవినాష్‌.. షాక్‌ ఎవరికో?

ఈసారి ఏపీ ఎన్నికల్లో వైఎస్‌ ఫ్యామిలీ పాలిటిక్స్ అత్యంత ఆసక్తికరంగా ఉన్నాయి. ఈసారి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో పాటు ఆయన సోదరి వైఎస్‌ షర్మిల, సోదరుడు అవినాష్‌ రెడ్డి కూడా ఎన్నికల బరిలో ఉన్నారు. జగన్‌ పులివెందుల నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు. ఇక కడప ఎంపీ సీటు కోసం వైఎస్‌ షర్మిల, అవినాష్‌ రెడ్డి పోటీ పడుతున్నారు. గతంలో అన్న విజయం కోసం కష్టపడిన వైఎస్‌ షర్మిల ఇప్పుడు ఏకంగా అదే అన్నకు సవాల్ విసురుతూ పోటీకి దిగింది.

తెలంగాణలో పెట్టిన పార్టీ అట్టర్‌ ఫ్లాప్‌ కావడం, అన్నతో ఆస్తుల గొడవల కారణంగా జగన్‌కు వ్యతిరేకంగా మారిన చెల్లెలు షర్మిల.. కాంగ్రెస్‌లో చేరి తెలంగాణలో కీలక పాత్ర పోషించాలని ప్రయత్నించారు. కానీ.. రేవంత్ రెడ్డి ఆమె పప్పులు ఉడకనివ్వకపోవడంతో చివరకు ఆమె ఆంధ్రా రాజకీయాలపై దృష్టి సారించారు. కాంగ్రెస్‌లో చేరి పీసీసీ అధ్యక్షురాలు అయ్యారు. ఏపీలో అటు జగన్, ఇటు చంద్రబాబు ఇద్దరూ బలమైన నాయకులే కావడంతో కాంగ్రెస్‌ను ఈ రెండు పార్టీలకు దీటుగా తయారు చేయడం అంత ఈజీ కాదని ఆమెకు తెలిసివచ్చింది.

ఇదే సమయంలో వివేకా హత్య కేసును ప్రధాన ఆయుధంగా షర్మిల మలచుకుంటున్నారు. వైఎస్‌ వివేకానందరెడ్డి కూతురు సునీత చేస్తున్న పోరాటాన్ని ఆమె తనకు అనుకూలంగా మలచుకుంటున్నారు. అందుకే ఏకంగా కడప పార్లమెంటు నుంచి బరిలో దిగారు. అటు జగన్‌ కూడా చెల్లెలు ఆరోపణలను ఏమాత్రం పట్టించుకోకుండా తన వ్యూహంతో తాను సాగుతున్నారు. ఎన్ని ఆరోపణలు వచ్చినా మళ్లీ కడప నుంచి అవినాష్‌ రెడ్డినే బరిలో దింపారు.

దీంతో ఇప్పుడు కడప రాజకీయం రసవత్తరంగా మారింది. కడప పార్లమెంటు నుంచే నేరుగా వైఎస్‌ కుటుంబ సభ్యులు అవినాష్‌ రెడ్డి, షర్మిల నేరుగా తలపడుతున్నారు. ఇక జగన్‌ నియోజక వర్గం పులివెందుల కూడా కడప పార్లమెంటు పరిధిలోనే ఉండటం వల్ల షర్మిల అక్కడ నేరుగా జగన్‌తోనే తలపడుతున్నట్టు లెక్క. వైఎస్‌ సునీతను వెంటపెట్టుకున్ని ప్రచారం చేస్తున్న  షర్మిల.. ఏకంగా వైఎస్‌ బిడ్డలం.. కొంగు చాచి న్యాయం అడుగుతున్నామంటూ పులివెందుల గడ్డపై  సెంటిమెంటును రాజేస్తున్నారు. మరి ఈ కుటుంబ పోరులో విజేతలెవరో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: