రేవంత్‌, కేసీఆర్‌: రైతుల విషయంలో దొందూదొందే?

తెలంగాణలో ప్రస్తుతం రైతుల అంశం చుట్టూ పాలిటిక్స్ నడుస్తున్నాయి.  ఎన్నికల సమయంలో ఏ చిన్న సమస్య కనిపించినా రాజకీయం చేయడానికి విపక్షాలు కాచుకొని కూర్చుంటాయి. ఇప్పుడు ఈ అంశం చుట్టూనే రాజకీయాలు చేస్తున్నాయి. ఆందోళనలు చేపడుతున్నాయి. తాజాగా మాజీ సీఎం కేసీఆర్ నల్గొండ, సూర్యాపేట, జనగాంతో పాటు కరీంనగర్ జిల్లాలో పొలం బాట పట్టారు.

పదేళ్లు సీఎంగా ఉన్న సమయంలో ఏనాడు రైతుల వద్దకు వెళ్లలేదనే అపవాదు కేసీఆర్ పై ఉంది. వరదలు, తుపానులు వచ్చినా ఏరియల్ వ్యూ ద్వారా పంట నష్టాన్ని పరిశీలించారు. తప్ప రైతులను నేరుగా కలవలేదు. కానీ ప్రతిపక్ష నేత హోదాలో అన్నదాతలను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు అని విమర్శించారు. ఇంతే కాదు వంద రోజుల కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు.

దీనికి కాంగ్రెస్ నేతలు బదులిస్తూ.. కాంగ్రెస్ పాలనలో రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోలేదని పేర్కొన్నారు. ఇంకా కేసీఆర్ పాలనలోనే 2014-22 వరకు 6912 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఈ మేరకు ఎన్ సీ ఆర్ బీ రికార్డులు ఉన్నట్లు బయట పెట్టారు.  రైతులు చనిపోకపోతే కేసీఆర్ రైతు బీమా డబ్బులు ఎందుకు ఇచ్చారు.. రైతులు చనిపోలేదంటే ఆ డబ్బులు మీరే నొక్కేశారా అని దీనికి కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇదంతా చూస్తుంటే ఒక సామెత గుర్తుకు వస్తోంది. ఇద్దరు దొంగలు ఒక చోట చేరి మాట్లాడుకుంటుంటే.. రాణి గారి బంగారు గొలుసు కొట్టేసిన విషయం బయటకు వచ్చింది అన్నట్లు.  ఒకపక్క కేసీఆర్ ఏమో బంగారు తెలంగాణ చేశారు అని చెబుతుంటే ఇంత మంది రైతులు చనిపోయారా అనే ప్రశ్న తలెత్తుతోంది. మరోవైపు మార్పు రావాలి.. కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో వంద రోజుల్లోనే 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారా. ఇదంతా నిజమేనా.. తెలంగాణలో రైతులు ఇంతలా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారా అని పలువురు చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: