జగన్‌, బాబు: ఎలక్షన్‌ హీట్‌ పెరిగింది.. కేసుల జోరు మొదలైంది?

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల వేడి పెరిగింది. దీనికితోడు ఒక పార్టీ నేతలపై మరో పార్టీ నేతలు కోడ్‌ ఉల్లంఘనల కేసులు పెట్టుకుంటూ హీట్‌ మరింత పెంచేస్తున్నారు. గత నెల 31న ఎమ్మిగనూరు, మార్కాపురం, బాపట్ల సభల్లో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ తాజాగా వైసీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. చంద్రబాబు తన ప్రసంగంలో సీఎం జగన్ పై పరుష పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేశారని సీఈఓ కు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు.

వైసీపీ నేతల ఫిర్యాదుపై స్పందించిన ఈసీ.. వైసీపీ చేసిన ఫిర్యాదుపై చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలంటూ చంద్రబాబుకు ఇచ్చిన నోటీసులో  సీఈవో ముఖేష్ కుమార్ మీనా గడువు ఇచ్చారు. అయితే కేసుల విషయంలో తామూ ఏమీ తక్కువ కాదని నిరూపిస్తున్నారు టీడీపీ నేతలు కూడా.  టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై మంత్రి జోగి రమేష్ చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు కూడా ఈసీకి ఫిర్యాదు చేశారు.

టీడీపీ నేతల ఫిర్యాదుపై స్పందించిన ఈసీ.. మంత్రి జోగి రమేష్ కు నోటీసులు జారీ చేసింది. చంద్రబాబుపై చేసిన అభ్యంతరకర, అసభ్యకరమైన వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలంటూ మంత్రి జోగి రమేష్‌కు ఈసీ నోటీసులు జారీ చేసింది. ఇంటింటి ప్రచారంలో భాగంగా జోగి రమేష్ ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా టీడీపీ నేతలు వీడియో ఆధారాలు సమర్పించారు. ఎన్నికల నియామావళి ప్రకారం అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయకూడదని అన్ని రాజకీయ పార్టీలకు ఇప్పటికే సూచనలు ఇచ్చామని ఈసీ అంటోంది.

ఇలాంటి ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తున్న ఈసీ.. 48 గంటల్లోగా ఇలాంటి వ్యాఖ్యలపై సమాధానం ఇవ్వాలని ఆదేశాలు ఇస్తోంది. ఇవ్వని పక్షంలో తదుపరి చర్యలు ఉంటాయని ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం చెబుతోంది. టీడీపీపై సామాజిక మాధ్యమాల్లో చేసిన దుష్ప్రచారంపైనా వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డికి కూడా తాజాగా ఈసీ నోటీసులు జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: