జగన్‌: నిమ్మగడ్డ.. ప్రియమైన శత్రువు?

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ .. ఎన్నికల సమయంలో ఆయన తాను ఏంటో నిరూపించే పనిలో ఉన్నట్లు కనిపిస్తోంది. నిమ్మగడ్డ చంద్రబాబు హయాంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమితులయ్యారు.  ఆ తర్వాత జగన్ ప్రభుత్వంలోను కొంత కాలం కొనసాగారు. అయితే ఆయన టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని గతంలోను, ప్రస్తుతం వైసీపీ ఆరోపిస్తూనే ఉన్నారు. జగన్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆయన్ను పదవి నుంచి తొలగించింది.

అయితే ఈ నియామకం న్యాయస్థానంలో నిలవలేదు. అప్పట్లో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కి ప్రభుత్వానికి పెద్ద యుద్ధమే నడిచింది. ఈ సమయంలో జగన్ ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి సీఎం హోదాలో ఆయనపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు, ఆయనది ఒకే సామాజిక వర్గం అని నిందించారు. అందుకే టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చివరకు ఆయన పదవీ బాధ్యతలు ముగియడం.. ఆయన హైదరాబాద్ వెళ్లడం జరిగిపోయాయి.

ఇప్పుడు సీన్ కట్ చేస్తే జగన్ పై కోపంతో ఆయన ఆధ్వర్యంలో ఉన్న సిటిజన్ ఫర్ డెమొక్రసీ తరఫున వాలంటీర్ వ్యవస్థపై కేంద్ర  ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎన్నికల సంఘం వాలంటీర్లను ఎన్నికల ముగిసే వరకు ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరు కాకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఇది టీడీపీ కి మేలు చేకూర్చాలని ఆయన భావించినా.. ఆయనకే తెలియకుండా వైసీపీకి లాభం చేకూరింది.

ఎలా అంటే.. ఇప్పుడు వాలంటీర్లు, పింఛన్లపై పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఏపీలో పండుటాకులకు పింఛన్లు ఆగిపోవడానికి కారణం చంద్రబాబే అని వారంతా భావిస్తున్నారు. దీనిపై ఫిర్యాదు మేం చేయలేదు అని చెప్పడానికి టీడీపీకి అవకాశం లేకుండా పోయింది. రమేశ్ కుమార్ తో టీడీపికి ఉన్న సాన్నిహిత్యం చూసిన వారు ఇది ఎవరైనా ఆ పార్టీ పని కాదు అంటే నమ్ముతారా… మరోవైపు ఆయన చేసిన పనిని టీడీపీ ఖండించలేకపోతోంది.  వాలంటీర్లను కొనసాగించాలని ఈసీకి లేఖ రాయలేకపోతోంది. అంటే ఇది టీడీపీకి ఇష్టమైన చర్యగానే వైసీపీ అభివర్ణిస్తోంది. ఇది వచ్చే ఎన్నికల్లో టీడీపీపై పెను ప్రభావం చూపే అవకాశం ఉంది. మొత్తంమీద రమేశ్ కుమార్ వైసీపీకి  మంచి గిఫ్ట్ ఇచ్చారనే  చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: