తిరుపతి: కూటమి నేతలను నిండా ముంచేసిన పవన్‌,బాబు?

తిరుపతిలో కూటమి నేతలకు 2024 సార్వత్రిక ఎన్నికలు విచిత్ర పరిస్థితులను తెచ్చిపెట్టాయి. ఎవరూ ఊహించని రీతిలో అభ్యర్థుల మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. పార్టీల జెండా, ఎజెండా కనుమరుగైంది. టికెట్ కోసం కష్టాలు ఎదుర్కొన్న నేతలు పక్కన పెట్టాల్సి వచ్చింది. కూటమి కుంపట్లు రగులుతున్న వేళ టీడీపీ ఆశావహులు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోవాల్సి వచ్చింది.

పొత్తులో భాగంగా తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని జనసేనకు, పార్లమెంట్ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. జనసేన తిరుపతి సీటును వైసీపీ చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు, బీజేపీ తిరుపతి పార్లమెంట్ స్థానాన్ని గూడురు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాదరావుకు కట్టబెట్టారు. వాస్తవానికి వైసీపీ వీరికి సీట్లు నిరాకరించగా..వారు పార్టీ మారి టికెట్లు దక్కించుకున్నారు. దీంతో స్థానిక బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

వాస్తవానికి ప్రజారాజ్యం స్థాపించిన దగ్గర నుంచి ఉన్న నాయకులు డా.హరి ప్రసాద్, కిరణ్, డా.బాబు కార్యకర్తల గణంతో జనసేనలో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. కానీ వీరికి పవన్ టికెట్ నిరాకరించారు.  టీడీపీ తరఫున ఈ సీటును 2014లో గెలిచిన సుగుణమ్మ ఆశించారు. మరోవైపు టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీనే నమ్ముకొని ఉన్న నర్సింహ యాదవ్ కు నిరాశే ఎదురైంది. ఇక బీజేపీ తరఫున భాను ప్రకాశ్ రెడ్డి పొత్తులో లేనప్పుడు ఆయనకు సీటు వస్తుంది. కూటమి ఏర్పడితే సీటు త్యాగం చేయాల్సి వస్తుంది.

పోనీ పొత్తులో భాగంగా సీట్లు విషయంలో కాస్త సమస్యలు ఎదురయ్యాయి అనుకున్నా.. కనీసం ఆ పార్టీని నమ్ముకొని మొదటి నుంచి పార్టీలో ఉంటూ  బలోపేతానికి కృషి చేసిన వారికి కాకుండా ఇతర వ్యక్తులు.. వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి సీట్లు కేటాయించారు. దీంతో ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలనే టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు గెలిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీడీపీ స్థాపించిన దగ్గర నుంచి ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు చూడలేదని ఆపార్టీ నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: