చంద్రబాబు: ఆ 2 వర్గాలను కంట్రోల్‌ చేయకపోతే కష్టమే?

ఇల్లు అలకగానే పండుగ కాదు. పొత్తు పెట్టుకోగానే విజయం రాదు.  ఈ విషయం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి బాగా తెలుసు. ఎందుకుంటే ఒక్క 2019 మినహా ఆయన ఎప్పుడు సింగిల్ గా పోటీ చేయలేదు. పలు పార్టీలతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్లినా అన్ని సందర్భాల్లో విజయం ఆయన్ను వరించలేదు. పొత్తుల వల్ల బలం, బలహీనత రెండూ చంద్రబాబుకి తెలుసు. సమయానుకూలంగా వ్యవహరించడం, మాట్లాడటం ఆయనకు తెలిసినట్లు మరెవరకీ తెలియదు.

1999లో పొత్తు పెట్టుకొనే చంద్రబాబు గెలిచారు. 2004లో మరోసారి ఓడిపోయారు. 2009లో అన్ని రాజకీయ పార్టీలతో మహా కూటమి అంటూ ఎన్నికలకు వెళ్లి పరాజయం పాలయ్యారు. 2014లో బీజేపీ తో పొత్తు జనసేన మద్దతుతో విజయం సాధించారు. 2019లో సింగిల్ గా పోటీ చేసినా.. వామపక్షాలు, జనసేన పార్టీలు అంతర్గతంగా చంద్రబాబుకి మద్దతు తెలిపాయి అనే అపవాదు ఉంది. ఇప్పుడు మళ్లీ 2014 పార్టీలను రిపీట్ చేస్తున్నారు.

అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే ఉద్దేశంతో పొత్తు పెట్టుకున్నామని చెబుతున్నా.. అంతర్గతంగా ఈ మూడు పార్టీల ఓట్లు బదలాయింపు సక్రమంగా జరుగుతుందా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. గతంలో బీజేపీ ఓటు టీడీపీకి, టీడీపీ ఓటు బీజేపీకి బదలాయింపు జరిగింది. ఈ దఫా మాత్రం అంతగా ఓటు ట్రాన్స్ ఫర్ జరిగే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

నిన్న మొన్నటి వరకు బీజేపీ ని, మోదీని వ్యతిరేకిస్తూ పోస్టులు పెట్టిన టీడీపీ.. చంద్రబాబుని తూర్పారపడుతూ బీజేపీ వేసిన కౌంటర్లను ఆయా పార్టీల కార్యకర్తలు మరిచిపోలేకపోతున్నారు. ఈక్రమంలో ఇరు పార్టీల నాయకులు ఆయా సోషల్ మీడియా యాక్టివిస్టులను నియంత్రించాలి. కానీ అదేమీ జరగనట్లు కనిపిస్తోంది. రఘురామకృష్ణరాజు విషయంలో ఇరు పార్టీల మధ్య గొడవలు మరోసారి బయట పడ్డాయి. దీంతో పాటు టీటీపీ అనుకూల మీడియాలో మోదీని వ్యతిరేకిస్తూ కాలమ్స్ వస్తూనే ఉన్నాయి. ఇవి బీజేపీ కార్యకర్తలకు అసహనం కలిగించేవే. కాబట్టి టీడీపీ అధినేత అటు సోషల్ మీడియాను, ఇటు తన అనుకూల మీడియాను కంట్రోల్ చేయలేకపోతే ఆయనకే నష్టం కలుగుతుందని పలువురు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: