ఈడీ: కవిత భర్త అనిల్‌ను కూడా విచారిస్తారా?

దిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించింది. ఈడీ అధికారులు ఆమెను రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరు పరిచారు. కవితను విచారించడానికి ఇంకా వారం కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోర్టుని కోరింది. దీంతో న్యాయస్థానం ఆమెకు ఈ నెల 23వరకు రిమాండ్ విధించింది.

కవిత రిమాండ్ లో ఉండగా ఆమె భర్త అనిల్ కు కూడా ఈడీ నోటీసులు పంపింది. విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఆయనతో పాటు కవిత వద్ద పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తిగత సిబ్బందిని కూడా విచారించేందుకు ఈడీ సిద్ధమైంది. శుక్రవారం కవిత అరెస్టు సందర్భంగా ఈడీ ఐదు సెల్ ఫోన్లను సీజ్ చేసింది. వాటిల్లో అనీల్ తో పాటు ముగ్గురు ఫోన్లు కూడా ఉన్నాయి. విచారణ సమయంలో వారి కళ్లముందే ఆ ఫోన్లను అన్ లాక్ చేసి, సమాచారాన్ని పరిశీలించేందుకు ఈడీ సిద్ధం అవుతోంది.

ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించిన సమాచారాన్ని అనిల్ నుంచి రాబట్టనున్నట్లు సమాచారం. ఈ స్కాంలో హైదరాబాద్ నందితనగర్ లోని కవిత నివాసంలో పలు సమావేశాలు జరిగినట్లు ఈడీ ఇప్పటికే గుర్తించింది. గతంలో ఈడీ దిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టుకి ఇచ్చిన పలు రిమాండ్ రిపోర్టుల్లోను ఈ అంశాన్ని ప్రస్తావించింది. 2020 ఆరంభంలో కవిత ఇంట్లో జరిగిన భేటీలో ఈ కేసులో సహ నిందితులుగా ఉన్న సమీర్ మహేంద్ర, శరత్ రెడ్డి, అరుణ్ పిళ్లై, అభిషేక్ బోయిన్ పల్లి పాల్గొన్నారు.

వీరితో పాటు అనిల్ కూడా పాల్గొన్నట్లు కోర్టుకు ఇచ్చిన రిపోర్టులో పేర్కొంది. ఈ నేపథ్యంలో అసలు ఆ రోజు సమావేశంలో ఏం మాట్లాడారు? అనే అంశంపై అనీల్ ను విచారించనున్నట్లు స్పష్టమవుతుంది. మనీ లాండరింగ్  కింద రూ.కోట్లు చేతులు మారినట్లు ఇప్పటికే ఈడీ నిర్ధారించింది. ఆ నగదు హవాలాకు సంబంధించిన అంశాలపై కూడా అనిల్ ను విచారించే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: