రేవంత్‌ 100 రోజులు.. ఇదీ బీఆర్‌ఎస్‌ రిపోర్ట్‌?

వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు, 13 హామీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ మాట నిలుపుకొలేదని, మాట ఇచ్చి ప్రజలను మోసం చేశారని బీఆర్‌ఎస్‌ అంటోంది. రేవంత్ రెడ్డి వంద రోజుల పాలనను మూడు విచారణలు, ఆరు వేధింపులుగా బీఆర్‌ఎస్‌ అభివర్ణిస్తోంది. డిసెంబర్ తొమ్మిదిన రెండు లక్షల రుణమాఫీ అని ఇప్పటివరకు అతీగతీ లేదంటున్న బీఆర్‌ఎస్‌.. గద్దెను రెండు రోజుల ముందుగానే ఎక్కారు కానీ, హామీల అమలు మాత్రం లేదని మండిపడుతోంది.

కేసీఆర్ తెలంగాణ పరువు పెంచితే రేవంత్ రెడ్డి కరవు పెంచుతున్నారని... కేసీఆర్ హయాంలో పచ్చటి పొలాలు, పదేళ్ల తర్వాత పొలాల్లో మంటలు కనిపిస్తున్నాయని బీఆర్‌ఎస్‌ అంటోంది. రేవంత్ రెడ్డి పాలనలో కన్నీళ్లకు కొరత లేని పరిస్థితి నెలకొందన్న బీఆర్‌ఎస్‌... ఖాళీ బిందెల ప్రదర్శన సీఎం నియోజకవర్గం కొడంగల్ లోనే కనిపిస్తోందని అంటోంది. కర్నాటక నుంచి కనీసం తాగునీరు కూడా తీసుకురావడంలో పూర్తి వైఫల్యం చెందారని, వచ్చీ రాగానే ప్రాజెక్టులు అప్పగించేందుకు అంగీకరించి భారాస పోరాటంతో వెనక్కు తగ్గారని బీఆర్‌ఎస్‌ అంటోంది.

కేసీఆర్ కిట్లలో పోటీ పడితే రేవంత్ రెడ్డి తిట్లలో పోటీ పడుతున్నారని, ప్రతి పది రోజులకోమారు దిల్లీ వెళ్లి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని బీఆర్‌ఎస్‌ అంటోంది. కేసీఆర్ అనారోగ్యాన్ని కూడా సీఎం, మంత్రులు నీచమైన రాజకీయం చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ ఆక్షేపించింది. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, భాజపా ఒప్పందం చేసుకున్నాయన్న  మాజీమంత్రి... పార్టీ మారితే రాళ్లతో కొట్టాలన్న రేవంత్ రెడ్డి టికెట్ రాకపోతే భాజపా నేత ఇంటికి వెళ్లారని ఎద్దేవా చేస్తోంది. యూ టర్న్, యూ ట్యూబ్ పాలన మాత్రమే కనిపిస్తోందని బీఆర్‌ఎస్‌ అంటోంది.

పార్టీల గేట్లు ఎత్తడం కాదు.. ప్రాజెక్టుల గేట్లు ఎత్తి పంటలకు నీళ్లు ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ సూచించింది. రాష్ట్రంలో రైతులది జలఘోష అంటున్న బీఆర్‌ఎస్‌.. వంద రోజుల పాలనలో 174 మంది రైతులు, 38  మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పరిస్థితులు కనిపిస్తున్నాయని... కాంగ్రెస్ వచ్చింది కరవు వచ్చింది, ఆత్మహత్యలు ప్రారంభం అయ్యాయని బీఆర్‌ఎస్‌ నేతలు ఘాటుగా వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

brs

సంబంధిత వార్తలు: